ఆర్థిక ప్యాకేజీ చివరి విడతలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యలు విద్య, వైద్య రంగాలపై కీలక ప్రభావం చూపుతాయన్నారు. పబ్లిక్ రంగ సంస్థల ఊతానికి ఈ ఉద్దీపనలు సహకరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఆర్థికమంత్రి ఇవాళ ప్రకటించిన సంస్కరణలు విద్య, వైద్యంపై రూపాంతర ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవస్థాపకులు, పబ్లిక్ రంగ సంస్థలకు ఊతమందించడం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తీసుకురావడానికి ఉపయోగపడతాయి. సంస్కరణ పథకాలు రాష్ట్రాలకూ ప్రేరణగా నిలుస్తాయి."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.
'సంతృప్తికరంగా...'
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చివరి విడత ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ సర్కార్ ప్రకటించిన ప్యాకేజీ కీలకంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి ఇచ్చిన అదనపు నిధులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. ఈ చర్యలు విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు షా. కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
"వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖర్చులు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లా ఆస్పత్రిలో డిసీజ్ బ్లాక్‌లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ప్రయోగశాలలు, పర్యవేక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తోంది. ఈ ముందుచూపు చర్యలు భారత్‌ను వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్తాయి."-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
'వలస కార్మికులకు లబ్ధి'
ప్యాకేజీపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40,000 కోట్లు కేటాయించడం వల్ల స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్‌లో కరోనా లాంటి సంక్షోభం తలెత్తినా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నడ్డా. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలు.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
విపక్షాలు గరం
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పేరిట అంకెల గారడీ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేవలం రూ.3.22 లక్షల కోట్ల ఉద్దీపనలు మాత్రమే ప్రకటించి, చేతులు దులుపుకుందని విమర్శించింది. సరైన ప్రణాళిక లేకుండా లాక్డౌన్ విధించడం వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులకు గురయ్యారని, వారి దుస్థితికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
వామపక్షాలు
మరోవైపు.. ప్యాకేజీపై వామపక్షాలు పెదవి విరిచాయి. ప్యాకేజీ తప్పుదోవపట్టించే విధంగా ఉందని వ్యాఖ్యానించాయి. గత ఐదు రోజులుగా ప్రకటించిన ప్యాకేజీ మొత్తం అంకెల గారడీగా ఉందని సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరీ ఎద్దేవా చేశారు. దీనివల్ల సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా సైతం కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను అమ్మకానికి పెట్టి స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు తగిన నిధులు సమకూర్చకుండా.. అప్పులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.