సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేల రాజీనామా అంశం కొలిక్కి వచ్చినందున.. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న కన్నడ రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం నిలుస్తుందో లేదో అన్న ఊహాగానాలకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. సభాపతి రమేష్ కుమార్ ఆదేశానుసారం నేడు ముఖ్యమంత్రి కుమారస్వామి సభలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. చర్చ పూర్తయిన వెంటనే విధానసభలో ఓటింగ్ జరగనుంది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం బలం వందకు పడిపోయింది. మరోవైపు ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో భాజపా బలం 107 కు చేరింది. ఈ నేపథ్యంలో దాదాపు 13 నెలల కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులతో అందరి దృష్టి మరోసారి కర్ణాటక రాజకీయాలపై పడింది.
పరీక్ష వాయిదా..!!
ఈ పరిస్థితిలో విశ్వాస పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామాచేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. సంకీర్ణ సర్కారు కూలిపోవడం ఖాయమని.. తమ ప్రభుత్వం ఏర్పడుతుందని భాజపా నాయకులు ధీమాగా చెబుతున్నారు. మరోవైపు విశ్వాస పరీక్ష వాయిదా వేయించేలా కాంగ్రెస్-జేడీఎస్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు విధానసౌధలో కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు సమావేశమై..సుప్రీం తీర్పు అనంతర పరిణామాలు, విశ్వాస పరీక్షపై చర్చించారు.
అనంతరం స్పీకర్ రమేష్ కుమార్‌తో కర్ణాటక శాసనసభా వ్యవహారాల మంత్రి కృష్ణబైరె గౌడ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో తమ హక్కులకు భంగం కలిగిందని సభాపతికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ వాదనలు వినలేదని సభాపతికి తెలిపారు. సభ జరిగేటప్పుడు స్పీకర్ అనుమతితోనే సభ్యులు బయటకు వెళ్లాలని.. కానీ సభ అనుమతి లేకుండానే అసంతృప్త ఎమ్మెల్యేలు బయట ఉన్నారని ఫిర్యాదు చేశారు. విశ్వాస పరీక్ష వాయిదావేసే అంశం పరిశీలించాలని సభాపతిని కృష్ణబైరె గౌడ కోరారు.