మూడేళ్లలో 35దేశాలు తిరిగిన రైతు కుమారుడు మహారాష్ట్ర థానేకు చెందిన విష్ణుదాస్ ఓ సాధారణ రైతు కుమారుడు. ప్రపంచాన్ని చుట్టి రావాలని ఆయనకెప్పటి నుంచో ఆశ. విష్ణుదాస్ ఆశయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు... వారి కలైన సొంత ఇంటి కోసం దాచిన డబ్బును అతని చేతిలో పెట్టి దీవించారు. మరికొంత ధనాన్ని స్నేహితులకు సమకూర్చారు. ప్రపంచాన్ని చుట్టి రావాలంటే మాటలు కాదు. అడ్డొచ్చే వీసా నిబంధనలు... పరిమిత ధన వనరులు... అయినా కుంగిపోలేదు విష్ణుదాస్. తన ప్రయాణాన్ని ఖరీదైన విమాన మార్గం ద్వారా చేయలేదు. ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చయ్యే వివిధ ప్రయాణ సాధనాలతో యాత్రను కొనసాగించాడు.
ప్రపంచంపై పర్యావరణ సంతకం
ప్రకృతిని ప్రేమించే విష్ణుదాస్ ప్రపంచానికి తన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. తన యాత్రలో తిరిగిన ప్రతీ దేశంలోనూ ఓ మొక్కను నాటాడు. అమెరికా వీసా ముందుగా వచ్చినట్లయితే 8-9 నెలల ముందే తన యాత్ర పూర్తయ్యేదని చెప్పాడు విష్ణు.
యాత్ర ముగించుకుని వచ్చిన విష్ణుని కుటుంబంతో పాటు గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.
"ప్రపంచాన్ని చుట్టేయడానికి అవసరమైన ప్రయాణ ఖర్చుల కోసం ఇళ్లు కొనుగోలు చేసేందుకు దాచిన డబ్బును వినియోగించాను. స్నేహితులు, బంధువులు ఎంతో సహకరించారు. వారి సహాయం వల్లే నేనీయాత్ర పూర్తి చేశాను. అమెరికా వీసా ముందుగా వస్తే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల ముందే ఈ యాత్ర పూర్తి చేసేవాడిని. ప్రపంచ యాత్ర చేసేటప్పుడు ఇంట్లో వాళ్లు గుర్తొచ్చేవారు." -విష్ణుదాస్, ప్రపంచ యాత్రికుడు