తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలపై రైతు పోరాటం మరింత ఉద్ధృతం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. రేపు దిల్లీ-నోయిడా మధ్య ఉన్న సరిహద్దును దిగ్బంధిస్తామని ప్రకటించారు. మరోవైపు.. పలు రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాయని అన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.

By

Published : Dec 15, 2020, 9:47 PM IST

Farmers harden stance, say will 'make' govt repeal agri laws
సాగు చట్టాలపై రైతు పోరాటం మరింత ఉద్ధృతం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. దిల్లీ- నోయిడా మధ్య ఉన్న చిల్లా సరిహద్దును రేపు పూర్తిగా బ్లాక్‌ చేస్తామని ప్రకటించారు. మంగళవారం మీడియా సమావేశంలో రైతు నేత జగ్జీత్‌ డాల్లేవాల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తాము అడుగుతుంటే.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. చర్చల నుంచి తాము ఎక్కడికీ పారిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.

ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు ఈనెల 20న నివాళులర్పించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో అమరులైన అన్నదాతలకు డిసెంబర్‌ 20న ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు దేశవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేశారు.

వారితో చర్చకు సిద్ధం..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఉద్యమం కొనసాగిస్తున్న వేళ.. వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాయన్న మంత్రి నిజమైన రైతు సంఘాలతో చర్చలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్‌ యూనియన్(బీకేయూ)‌ సభ్యులతో సమావైశమైన తోమర్‌.. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ముందుకు వచ్చినందుకు బీకేయూ నాయకులకు తోమర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టాలపై కొన్ని సవరణలు కోరామన్న సంఘం ప్రతినిధులు తాము చేసిన సవరణలపై ప్రభుత్వం సానుకులంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details