21వ శతాబ్దంలో రాజకీయాలకు అభివృద్ధే ఆధారమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. దేశం కోసం నిజాయతీగా పనిచేసే పార్టీలను ప్రజలు గెలిపిస్తూనే ఉంటారని బిహార్ అసెంబ్లీ సహా ఉపఎన్నికల్లో భాజపా విజయంపై దిల్లీలో నిర్వహించిన సభలో మోదీ అన్నారు. కొవిడ్ సమయంలో ఎన్డీఏ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల మద్ధతు ఉందని ఎన్నికల ద్వారా నిరూపితమైందని స్పష్టంచేశారు. కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు.
బిహార్‌లో ఎన్డీఏ విజయం సహా ఉపఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భాజపా.. దిల్లీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'అందుకే దేశ నలుమూలల్లో భాజపా హవా'
ఎన్నికల్లో విజయానికి కృషిచేసిన వారందరినీ.. అభినందించారు. దేశంలో రెండు సీట్లతో రెండు గదుల మధ్య పనిచేసిన భాజపా..ఇప్పుడు దేశమంతటా విస్తరించిందన్నారు. కొవిడ్ సమయంలో కార్యక్రమాలు చేపట్టడానికి ప్రపంచదేశాలు.. తర్జనభర్జనపడిన సమయంలోనూ భారత్‌లో అనేక పథకాలను అమలు చేశామన్నారు. కొవిడ్ నిరోధానికి.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పనులకు ప్రజల మద్దతున్నట్లు ఎన్నికల‌్లో వెల్లడైందని మోదీ పేర్కొన్నారు.
''దేశ ప్రజలు పదేపదే తమ సందేశాన్ని స్పష్టంగా చెబుతున్నారు. దేశ అభివృద్ధి లక్ష్యం దిశగా నిజాయతీతో ముందుకెళ్లేవారికే. సేవ చేసే అవకాశం లభిస్తుందని తేల్చిచెప్పారు. దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీ నుంచి ప్రజలు ఇదే ఆశిస్తున్నారు. దేశానికి సేవ చేయండి, అందుకు సంబంధించిన పనిని చేపట్టండి. ప్రజలకు సేవ చేస్తే మీకు నిండైన ఆశీర్వాదాలు ఉంటాయని మంగళవారం నాటి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.''
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ధరావతు ఎందుకు దక్కడంలేదో కొన్ని పార్టీలకు అర్థంకావడం లేదంటూ కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేసిన ప్రధాని.. కుటుంబ రాజకీయాలపైనా వాగ్భాణాలు ఎక్కుపెట్టారు. దేశ సేవ కోసం భాజపాతో కలిసిరావాలని యువతకు పిలుపునిచ్చారు.