ఈ నెల 24 నుంచి నవంబర్ 3 వరకు కేంద్ర ప్రభుత్వం 'ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం నిర్వహించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రజల్లో.. ఒకరి సంస్కృతి పట్ల మరొకరికి అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం. దేశ వైవిధ్యాన్ని, సమగ్ర జాతీయ దృక్పథాన్ని మరింతగా ఇనుమడింపజేయడం ఈ మిషన్ లక్ష్యం.
ఈ నెల 24 నుంచి 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్'
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి నవంబర్ 3 వరకు ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 30,31 తేదీల్లో గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ 31న సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30,31 తేదీల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. 31వ తేదీ సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ల గౌరవవందనం స్వీకరించనున్న ప్రధాని.. కాసేపు వారితో ముచ్చటిస్తారు.
అనంతరం.. మోదీ లద్దాఖ్‌ను సందర్శించనున్నారు. ఈ నెల 31 నుంచి జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడుతాయి. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన రోజే ప్రధాని అక్కడ పర్యటించనుండడం విశేషం. మోదీ పర్యటనకు ముందే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించే అవకాశం ఉంది.
దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు సర్దార్ పటేల్ వినిపించిన మహోన్నత నినాదం 'ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్'ను మోదీ సాకారం చేయాలనుకుంటున్నారు. ఇది పూర్తిగా ఆచరణలోకి రాకపోయినా.. ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా సరైన అడుగులే వేస్తోందని చెప్పక తప్పదు.