కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై సోమవారం గవర్నర్ల సదస్సు నిర్వహించింది కేంద్ర విద్యా శాఖ. 'ఉన్నత విద్య పరివర్తనలో జాతీయ విద్యావిధానం-2020 పాత్ర' పేరిట చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
విద్యావేత్తల సలహాలు, సూచనల మేరకే కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చామని మోదీ తెలిపారు.
"ముందుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ విద్యా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యం. ఎంతోమంది నిపుణుల సూచనలతో దీనికి ఆమోదం తెలిపాం. దేశ ఆకాంక్షాలను నెరవేర్చటంలో విద్యావిధానం పాత్ర కీలకం. విద్యా విధానం ప్రభుత్వాలతో ముడిపడి ఉంది. కానీ, ఇందులో ప్రభుత్వ జోక్యం తగ్గించటం కూడా అవసరమే. ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులు చదవటం కన్నా నేర్చుకోవటంపై అధిక దృష్టి సారిస్తారు."