తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజారోగ్య క్షయం.. ద్విముఖ వ్యూహం తక్షణావసరం

క్షయ... ఈ వ్యాధికి భారత్​లో అనేక మంది సతమతమవుతున్నారు. 2018లో టీబీ బారిన పడిన వారు నాలుగు లక్షలమంది. నానాటికి పెరుగుతున్న దీని సంఖ్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. క్షయను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

ప్రజారోగ్య క్షయం

By

Published : Oct 23, 2019, 3:25 PM IST

సమకాలీన ప్రపంచంలో అతిపెద్ద ప్రజారోగ్య సమస్య, గరిష్ఠంగా అర్ధాంతర మరణాల్ని తన పద్దులో జమ చేసుకుంటున్న ‘నిశ్శబ్ద హంతకి’- క్షయ. టీబీగా వ్యవహరించే ఆ అంటువ్యాధి బారిన పడుతున్న రోగుల్లో సుమారు నాలుగోవంతుకు, దాదాపు మూడోవంతు చావులకు నెలవుగా పరువుమాస్తున్న దేశం... ఇండియా! విశ్వవ్యాప్తంగా ఏటా కోటిమంది వరకు క్షయ పాలబడుతుండగా, నిరుడు ఒక్క సంవత్సరమే ఆ మహమ్మారి 15 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. సంవత్సర కాలంలో కొత్తగా 27 లక్షల మేర క్షయ కేసులు నమోదైన భారత్‌లోనే, 2018లో కడతేరిపోయిన ప్రాణాల సంఖ్య రమారమి నాలుగున్నర లక్షలు. అంటే, క్షయవ్యాధి మరణాల పద్దులో మూడోవంతుదాకా దేశంలోనే సంభవిస్తున్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికాంశాల ప్రకారం, క్షయవ్యాధి పీడిత దేశాల్లో భారత్‌ ‘అగ్ర’స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదు. చైనా (తొమ్మిది శాతం), ఇండొనేసియా (8), ఫిలిప్పీన్స్‌ (6 శాతం) ప్రభృత దేశాల్లోనూ టీబీ కోరచాస్తున్నా- రోగులు, మరణాల సంఖ్య ప్రాతిపదికన ఇక్కడికి అక్కడికి హస్తిమశకాంతరముంది. ఇటీవలే విడుదలైన ‘టీబీ ఇండియా రిపోర్ట్‌ 2019’ గుజరాత్‌, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వ్యాధి ప్రకోపాన్ని కళ్లకు కట్టింది. తెలంగాణలో నిరుడు 52 వేల దాకా కొత్త కేసుల నమోదు, ఏపీలో అధికారిక అంచనాలకు మించి క్షయ విజృంభిస్తున్నదన్న కథనాలు- ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనకర స్థితిగతుల్ని నిర్ధారిస్తున్నాయి. టీబీ గుర్తింపు, చికిత్సల నిమిత్తం ప్రజాసేవారంగాన తగినన్ని సదుపాయాలు నెలకొల్పినట్లు ప్రచారం హోరెత్తుతున్నా- చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తూపోవడం, తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది.

వ్యాధి సోకిన తొలిదశలోనే గుర్తించి, పరీక్షల ద్వారా నిర్ధారించి, సరైన చికిత్స అందిస్తే టీబీ నయమవుతుంది. ఔషధాల కొరత మూలాన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు రోగపీడితుల్లో ఒక్కరికే క్షయవ్యాధి చికిత్స సమకూరుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెబుతోంది. వెనకబడిన దేశాల్లోని 80శాతం రోగులు తమ అయిదోవంతు రాబడిని వైద్యఖర్చులకే వెచ్చించాల్సి వస్తున్నదనీ అది మదింపు వేసింది. దేశంలో క్షయ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన గణాంక వివరాలు కొంతమెరుగైన స్థితిని ఆవిష్కరిస్తున్నాయి. ఇక్కడ టీబీ సోకినవారిలో 74 శాతం చికిత్స పొందారని, అందులో స్వస్థత చేకూరినవారు 81 శాతమని సూచిస్తున్నా- లక్షలమంది మృత్యువాతపడుతూనే ఉన్నారన్న యథార్థం ఎవరూ కప్పిపుచ్చలేనిది. దేశంలో ఏనాడో 1962లోనే జాతీయ టీబీ నియంత్రణ ప్రణాళికను పట్టాలకు ఎక్కించారు. ‘క్షయ ముక్త్‌ భారత్‌’ను అవతరింపజేసే కృషిలో భాగమంటూ జాతీయ వ్యూహ ప్రణాళికలో పలు మార్పులు చేర్పులకు చోటుపెట్టారు. 2030 సంవత్సరం నాటికి యావత్‌ ప్రపంచంలో ఎక్కడా క్షయవ్యాధికి ఉనికే లేకుండా దాన్ని తుడిచిపెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ అభిలషిస్తోంది. అవసరమైన నిధుల కేటాయింపు, వాటి వినియోగం సక్రమంగా సాగినట్లయితే 2045 నాటికి క్షయ నిర్మూలన సాధ్యం కావచ్చునని అంతర్జాతీయ నిపుణుల బృందమొకటి ఆరు నెలల క్రితం అంచనా వేసింది. తనవంతుగా 2025నాటికే దేశంలో క్షయ నిర్మూలనను లక్షిస్తున్న కేంద్రం, అందుకోసం ముఖ్యమంత్రులందరూ కూడిరావాలని లోగడే పిలుపిచ్చింది. క్షయ వ్యతిరేక పోరు ఇప్పటికీ ఏకోన్ముఖం కాలేదని సరికొత్త అధ్యయనాంశాలు స్పష్టీకరిస్తున్నాయి. గత సంవత్సరం భారత్‌లోనే అయిదు లక్షల 40 వేల దాకా క్షయ కేసులు నమోదు కాలేదంటున్న విశ్లేషణల నేపథ్యంలో, అంటువ్యాధి విస్తరణ ముప్పును ఊహిస్తేనే- భీతావహ వాతావరణం వెన్నులో చలి పుట్టిస్తోంది.

టీబీ విధ్వంసక స్వభావంరీత్యా వారానికి మూడుసార్లు బదులు ప్రతి రోజూ రోగులకు ఉచిత ఔషధ పంపిణీ, సామాజిక భృతి పంపిణీ సహా వివిధ సాంత్వన చర్యల నిమిత్తం క్షయ నిర్మూలన పద్దుకింద చేస్తున్నామంటున్న దాదాపు నాలుగు వేలకోట్ల రూపాయల వార్షిక వ్యయం కేవలం కంటితుడుపు. క్షయ మూలాన దేశానికి ఏటా రూ.20 వేలకోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆ మధ్య ప్రధాని మోదీయే లెక్కకట్టారు. వ్యాధి పీడితుల చికిత్సకయ్యే వ్యయం, ఉత్పాదక నష్టాలు ఒక పార్శ్వమే. గాలిలో కలిసిపోతున్న లక్షలాది జీవితాల మూల్యాన్ని ఎంతటి మహాగణకులైనా మదింపు వేయగలరా? సకాలంలో టీబీని గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా 2000-2017 సంవత్సరాల మధ్య దేశదేశాల్లో అయిదు కోట్ల 40 లక్షల ప్రాణాల్ని నిలబెట్టగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇతోధిక నిధుల కేటాయింపు, మెరుగైన చికిత్సలపై దృష్టి కేంద్రీకరిస్తే భారత్‌లోనూ అది సుసాధ్యమే. నాలుగేళ్ల క్రితం దేశంలో ప్రతి లక్ష జనాభాకు రెండు వందలకు పైగా క్షయ కేసులు నమోదయ్యేవి. ఆ సంఖ్యను 2020 సంవత్సరానికి 142కు, 2023నాటికి 77కు, తరవాతి రెండేళ్లలో నలభై నాలుగుకు పరిమితం చేయాలని జాతీయ వ్యూహ ప్రణాళిక లక్షిస్తోంది. సంకల్పాలతోనే లక్ష్యాలు అమాంతం సాకారమైపోవు! స్వస్థ సేవల అందుబాటు, వాటి నాణ్యతల ప్రాతిపదికన 195 దేశాల జాబితాలో 145వ స్థానాన ఈసురోమంటున్న ఇండియా- ఇరుగుపొరుగున బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంకల సరసనా వెలాతెలాపోతోంది. విపరీత వాయుకాలుష్యాన్ని, పారిశుద్ధ్య లోపాల్ని కట్టడిచేసి- వ్యాధి నిరోధం, నివారణ అనే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరచడమే జనారోగ్య క్షయానికి గట్టి విరుగుడు కాగలుగుతుంది. కేంద్రం ఆర్థిక తోడ్పాటుతో, ప్రాథమిక దశలో రోగనివారణకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యప్రదమైన స్పర్ధ నెలకొంటేనే- దేశంలో టీబీ నియంత్రణ సుసాధ్యమయ్యేది!

ABOUT THE AUTHOR

...view details