మనిషిలోని మృగప్రవృత్తి జూలు విదిలించినప్పుడల్లా నేరాలూ ఘోరాలూ జరుగుతూనే ఉన్నాయి. వందమంది నేరగాళ్లు తప్పించుకొన్నా ఫరవాలేదు గాని, ఏ ఒక్క నిర్దోషికీ శిక్ష పడరాదన్న సమున్నతాదర్శం కొన్ని దశాబ్దాలపాటు భారత న్యాయపాలిక కరదీపిక కావడంతో- తప్పు చేసీ తప్పించుకోగలమన్న దిలాసాతో నేరగాళ్లకు కోరలూ కొమ్ములూ మొలుచుకొచ్చాయి. ‘ఏ ఒక్క నేరగాడూ తప్పించుకోరాదు- మరే నిర్దోషీ శిక్షకు గురి కారాదు’ అంటూ సుప్రీంకోర్టు గురి సరిచూసే నాటికే రాజకీయం నేరం అద్వైతసిద్ధి పొందాయి. తనవంతుగా నేరన్యాయ వ్యవస్థ గాంధీగారి మూడు కోతుల సిద్ధాంతాన్ని నిష్ఠగా పాటించడం మొదలుపెట్టింది. రాజకీయ నేరగాళ్లు చేసే ‘చెడు’ను కనడం-వినడం- దానిపై మాట్లాడటం మహాపాపమని అది తీర్మానించేసుకొన్న తీరును జస్టిస్ ధింగ్రా కమిటీ తాజాగా కళ్లకు కట్టింది. ఆ వివరం చిత్తగించండి!
'మహావృక్షం నేలకూలినప్పుడు సమీప భూమి కంపించడం సహజం'- ఈ సిద్ధాంతాన్ని ప్రవచించింది ఏ వృక్షశాస్త్రవేత్తో, భూభౌతిక శాస్త్ర నిపుణుడో కాదు. 1984లో ప్రధాని ఇందిర అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైన నేపథ్యంలో- అమాయక సిక్కుల ఊచకోత యథేచ్ఛగా సాగిపోవడంపై నయాప్రధానిగా రాజీవ్ స్పందన అది. ‘రాజకీయ నాయకులను నిందితులుగా పేర్కొంటూ బాధితులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ప్రభుత్వం తొక్కిపట్టింది... సిక్కులకు గుణపాఠం నేర్పడానికి హత్యాకాండ అవసరమని, నరమేధానికి సూత్రధారుల్ని తప్పనిసరిగా రక్షించాలనీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది’- 1996లో సంబంధిత కేసుల్ని విచారించిన దిల్లీ అదనపు సెషన్స్ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. దేశ రాజధానితోపాటు యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటిచోట్ల 3,300 పైగా అభాగ్యుల ప్రాణాల్ని కబళించిన ఘోరకలిని దేశ విభజన కాలంనాటి మతఘర్షణలతో పోల్చి నేరస్వభావాన్ని మసిపూసి మారేడు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెగించింది. అధినేతల మనసెరిగి మసలుకోవడంలో భిన్న యంత్రాంగాల విధిద్రోహం ఏ స్థాయికి చేరిందో జస్టిస్ ధింగ్రా కమిటీ పూసగుచ్చింది!
ఎందుకు అలసత్వం
'సిక్కుల ఊచకోతకు సంబంధించి క్రిమినల్ కేసుల్ని ఏదోవిధంగా మూసేయడానికే పోలీసు వ్యవస్థ, పాలన యంత్రాంగం అవిశ్రాంతంగా పరిశ్రమించాయి' అని జస్టిస్ ధింగ్రా కమిటీ నిగ్గుతేల్చింది. హత్యలు, లూటీలు, దహనకాండలకు సంబంధించి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్‌కు బాధితులు వందలకొద్దీ ప్రమాణ పత్రాలు సమర్పించినా- వాటి ఆధారంగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లు రూపొందించాల్సింది పోయి, కమిటీల మీద కమిటీల ఏర్పాటుతో కేసుల నమోదు తతంగాన్ని ఏళ్ల తరబడి సాగదీసిన దురాగతం నమోదైంది. దిల్లీలోని కల్యాణ్‌పురి ఠాణా అధికారి ఎస్‌ఎస్ త్యాగి హంతకుల కుట్రలో భాగస్వామిగా మారి సిక్కులను నిరాయుధుల్ని చెయ్యడం ద్వారా వారిని మూకహింసాగ్నికి సమిధలుగా మార్చేశారనీ జస్టిస్ ధింగ్రా కమిటీ సూటిగా ఆక్షేపించింది. కేసుల్ని నీరుగారిపోయేలా చేయడంలో పోలీసులు ప్రదర్శించిన టక్కుటమార విద్యలూ ఇన్నన్ని కావు. పరస్పరం ఏమాత్రం సంబంధం లేని 337 వేర్వేరు ఫిర్యాదుల్ని కలగలిపి అత్యంత భారీ ఎఫ్‌ఐఆర్ ఒక్కటే నమోదు చేసిన పోలీసుల కపటనాటక కౌశల విన్యాసం చెప్పనలవి కాదు!
ఫిర్యాదుల దర్యాప్తు మానవమాత్రులకు అసాధ్యమయ్యే రీతిలో పోలీసులు కావాలనే అలా వ్యవహరించారు. ‘ఒక్క దర్యాప్తు అధికారి ఏకంగా 500 కేసుల్ని చేపట్టి, సాక్షుల్ని కనుగొని, గట్టి ఆధారాలు సేకరించి, కోర్టులో నిందితులకు వ్యతిరేకంగా ఎలా ముందడుగు వెయ్యగలుగుతా’రన్న జస్టిస్ ధింగ్రా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందెవరు? మూడున్నర దశాబ్దాలుగా కేసులు కొనసాగుతూ దోషులు దర్జాగా తిరగగలుగుతున్నారంటే- పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే కారణమన్న కమిటీ వ్యాఖ్యను కాదనగలవారెవ్వరు?