ప్రకృతి మెచ్చే 'కలంఖుష్' కాగితం! ఒక్క ఏ-4 సైజు పేపర్ తయారవ్వాలంటే 10 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కనీసం 324 లీటర్ల నీరుంటేనే ఒక్క కిలో కాగితం తయారవుతుంది. అంతేనా.. ప్రపంచానికి సరిపడ కాగితం కావాలంటే లక్షలాది చెట్లను నరకాల్సిందే. దీంతో, పర్యావరణానికి తీరని హాని కలుగుతుంది. కానీ, చెట్లు నరికే అవసరమే లేకుండా.. నీటిని ఆదా చేస్తూ వ్యర్థ పదార్థాలతో కాగితం తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది? ప్రకృతి పులకరించిపోతుంది కదూ! అలాంటి పర్యావరణ హిత 'కలంఖుష్' కాగితాన్నే తయారు చేస్తోంది గుజరాత్, అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమంలోని 'ఖాదీ గ్రామోద్యోగ్ మండలి'.
500 ఏళ్లైనా చిరగదు...
'ఖాదీ గ్రామోద్యోగ్ మండలి' పరిశ్రమలో కార్మికులు చేత్తో కాగితం తయారు చేస్తున్నారు. ఖాదీ, కాటన్ వస్త్రాల వ్యర్థాల నుంచి నాణ్యమైన కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పర్యావరణహిత కాగితం తయారీలో నిత్యం కనీసం 20 మంది కార్మికులు నిమగ్నమై ఉంటారు. ఈ కాగితం సుమారు 200-500 ఏళ్ల పాటు మన్నుతుంది. చెదలు పట్టకుండా దీర్ఘకాలికంగా సమాచారాన్ని అక్షరరూపంలో భద్రపరుస్తుంది.
అంత నాణ్యమైనది కాబట్టే కలాన్ని సంతోషపరిచే కాగితమని అర్థంవచ్చేలా "కలంఖుష్" అని నామకరణం చేశారు. అంతే కాదు, ఈ కలంఖుష్ కాగితం హ్యాండ్ బ్యాగులు, శుభలేఖల తయారీలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కాగితంతో సృష్టించిన పూల కుండీలు, హస్తకళలు గాంధీ ఆశ్రమ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
తయారీ ఇలా..
కలంఖుష్ కాగితం తయారీకి మొదట కాటన్ వస్త్ర పరిశ్రమల నుంచి మిగిలిపోయిన, వ్యర్థ వస్త్రాలను సేకరిస్తారు. ఆ వస్త్రాలపై మురికి, రంగును తొలగించి.. కొద్ది రోజుల పాటు నీటిలో నానబెడతారు. ఆ వస్త్రాలు బాగా నానిన తర్వాత గుజ్జుగా మారతుంది. ఆ కాటన్ గుజ్జును ఓ పెట్టెలో వేసి ముడతలు లేకుండా పరుస్తారు. ఆపై పాలిష్ చేసి గాలికి ఆరేస్తారు. అవసరమైతే సహజ రంగులు కలుపుతారు. అప్పుడు తయారవుతుంది కలంఖుష్ కాగితం.
ఇంత కష్టపడి పర్యావరణహిత కాగితాలు తయారు చేస్తున్న పరిశ్రమకు జీఎస్టీ, మునిసిపల్ కమర్షియల్ టాక్సులు అదనపు భారంగా మారాయంటున్నారు పరిశ్రమ నిర్వాహకులు. ప్రభుత్వం సహకరిస్తే.. కలంఖుష్ కాగితాల ఉత్పత్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచుతుందంటున్నారు.
80 ఏళ్ల స్వదేశీ ప్రస్థానం...
మహాత్మాగాంధీ జన్మస్థలం గుజరాత్. అహ్మదాబాద్ ఆశ్రమం ఆయన ఆదర్శాలకు నిలయం. భారత దేశం తెల్లదొరల నిరంకుశత్వంలో మగ్గుతున్న రోజులవి. కాగితం కావాలంటే ఇంగ్లాండ్ దేశంపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఆ సమయంలోనే గాంధీ స్వదేశీ ఉద్యమంలో భాగంగా భారత దేశంలోనే పేపర్ ఉత్పత్తిని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. దీంతో 1940లో అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమంలో 'ఖాదీ గ్రామోద్యోగ్ మండలి' పేరిట కాగితం తయారీ పరిశ్రమను స్థాపించారు సర్ధార్ వల్లభాయి పటేల్. అప్పటి నుంచి దాదాపు 80 ఏళ్లుగా గాంధీ ఆదర్శాలకు కట్టుబడి.. స్వదేశీ ఉత్పత్తులను.. పర్యావరణ హిత కాగితాన్ని తయారు చేస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి: లాభసాటి సేద్యం- ఎలా సాధ్యం?