ఎన్నికల్లో పారదర్శకత కోసం సామాజిక మాధ్యమాల కృషి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకొన్నాయి ఆ సంస్థలు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఈ వేదికల్లో ఎన్నికల ప్రచారం జరగకుండా నిబంధనలు పాటిస్తామని ప్రకటించాయి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సంస్థలు. నైతిక నియమావళిపై సంతకం చేశాయి.
ఇదీ చూడండి:భారత్ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం
ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు అంతర్జాల ప్రచారంపై నిబంధనలు పాటిస్తామని సంతకం చేయడం ఇదే తొలిసారి. సామాజిక మాధ్యమాలన్నీ కలిసికట్టుగా ముందుకురావడం శుభపరిణామమన్నారు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా. కానీ.. కచ్చితంగా వాటిని అమలుచేయాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సామాజిక మాధ్యమాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో నైతిక విలువలను పాటించాలన్న ఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు సంస్థల ప్రతినిధులు.
సామాజిక మాధ్యమాలు వేదికగా ఎన్నికలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చూస్తామని ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చారు. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం వేగంగా చేరవేస్తామని తెలిపారు. అంతర్జాల ప్రకటనల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తామని తెలిపాయి సామాజిక మాధ్యమ సంస్థలు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సెక్షన్ 126 తెలియజేస్తుంది. ఇది ఎన్నికల ముందు 48 గంటలవరకు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని సూచిస్తుంది.
ఇదీ చూడండి:ప్రజలు అవివేకులు కాదని ప్రధాని గుర్తించాలి: ప్రియాంక గాంధీ