మోదీ వెబ్ సిరీస్‌పైనా ఈసీ నిషేధం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా 'మోదీ-జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్' వెబ్ సిరీస్‌పై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆన్లైన్ ప్రదర్శన నిలిపేయాలని నిర్మాణ సంస్థ 'ఎరోస్ నౌ'ను ఆదేశించింది.
మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్రమోదీ' విడుదలపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న నిషేధం విధించిన ఈసీ.. తాజాగా వెబ్సిరీస్పైనా అవే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.
"అందుబాటులో ఉన్న వాస్తవాలు, విషయాల దృష్ట్యా ఈ వెబ్ సిరీస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలైన వెబ్ సిరీస్‌ను పోలి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ అభ్యర్థి కావున ఈ వెబ్‌సిరీస్‌ను ప్రదర్శించొద్దు.''
- ఎన్నికల సంఘం
ప్రజ్ఞ సింగ్ ఠాకూర్‌పైనా...
ఉగ్రవాద వ్యతిరేక బృందం మాజీ సారథి హేమంత్ కర్కరేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలెదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞ సింగ్‌పై చర్యలకు సిద్ధమైంది ఈసీ. భోపాల్ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి సాధ్వికి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం రోజు భాజపా కార్యకర్తలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సాధ్వి. కార్యక్రమ నిర్వాహకులపైనా ఈసీ చర్యలు తీసుకోనుంది.