దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల వారీగా 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపింది. అయితే... కరోనా టీకా కార్యక్రమం ముగిశాక ఆ డేటాను ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా డిలీట్ చేయాలని స్పష్టం చేసింది.
'వ్యాక్సినేషన్‌కు ఈసీ డేటా సాయం' - latest news on Election Commission
ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రానికి పూర్తి సహకారం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వారీగా అవసరమైన డేటాను ఇచ్చేందుకు అంగీకరించింది.
పోలింగ్ కేంద్రాల్లో 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించేందుకు సహకరించాలంటూ గత ఏడాది డిసెంబర్ 31 న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోడాకు లేఖ రాశారని అధికారులు తెలిపారు. సమాచారం చోరీ కాకుండా అత్యుత్తమ పద్ధతులు అవలంబిస్తామని, డేటాను టీకా ప్రయోజనం కోసం మాత్రమే వినియోగిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఎన్నికల అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల కమిషన్ అధికారులు... కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతారన్నారు.