ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్యలో టాప్-10లోకి చేరింది భారత్. కొన్ని రోజులుగా ప్రతిరోజు 6 వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. పరీక్షలను విస్తృతం చేయడం సహా ప్రయాణాలపై ఆంక్షలను సడలించడం, వలసదారులు ఇళ్లకు చేరడం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపిన వివరాల ప్రకారం... కేసుల పెరుగుదల ప్రధానంగా హాట్‌స్పాట్ కేంద్రాల్లోనే జరుగుతోంది. అయితే ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలించడం వల్ల రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎలాంటి లక్షణాలు బయటపడని వైరస్ బాధితులకు.. స్క్రీనింగ్ పరీక్షలు చేసినా లాభం లేదన్నారు రణ్‌దీప్. వీరందరూ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళితే అక్కడా బాధితుల సంఖ్య పెరుగుతుందన్నారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి వలసదారులు తిరిగివెళ్లిన ప్రాంతాల్లో మరింత నిఘా పెట్టాలని సూచించారు ఎయిమ్స్ డైరక్టర్. చేతులు శుభ్రం చేసుకోకుండా, సరైన భౌతిక దూరం నియమాలను పాటించకుండా ప్రజలు రోడ్లపైకి వస్తే.. వైరస్ విజృంభణ మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.
వీటన్నిటితో పాటు కరోనా పరీక్షలు విస్తృతంగా జరుగుతుండటం.. కేసుల పెరుగుదలకు కారణమవుతోందని గులేరియా వెల్లడించారు.
రైలు, రోడ్డు రవాణా సేవలకు అనుమతులిస్తే.. కరోనా వైరస్ ఓ కార్చిచ్చులా విజృంభిస్తుందని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్ ఎస్ పాండే అభిప్రాయపడ్డారు.
"రైలు, రోడ్డు రవాణా సేవలు పాక్షికంగా మొదలయ్యాయి. వలసదారులు తమ సొంతగూటికి చేరుతున్నారు. దీంతో వైరస్ విజృంభణకు గేట్లు తెరుచుకున్నట్లు అయింది. వైరస్ ఓ కార్చిచ్చులా వ్యాప్తి చెందడానికి మనమే వాతావరణాన్ని సృష్టించాము. ఫలితంగా రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. లాక్‌డౌన్‌ను ఎప్పటికీ ఉంచలేము. అది నిజమే. కానీ ఆంక్షల సడలింపు పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రయాణాల వల్ల వైరస్ మరింత తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌ను నియంత్రించడానికి ఇక ప్రభుత్వం బలమైన నిఘాను ఏర్పాటు చేయాలి. అయితే అది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి."