తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా తప్పుడు సమాచారంతో తంటాలు

కరోనా కంటే వేగంగా వైరస్​కు చెందిన నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఇది. ఈ సమస్య మన దేశంలోనూ ఉంది. జనతాకర్ఫ్యూ సమయంలో ప్రధానంగా రెండు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చివరకు ఆ రెండు నకిలీ వార్తల్లోనూ నిజం లేదంటూ ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాంటి వార్తలు వ్యాప్తి చెందుకండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు.

During this coronavirus pandemic, 'fake news' is putting lives
తప్పుడు సమాచారంతో తంటాలు

By

Published : Apr 16, 2020, 7:55 AM IST

ప్రస్తుత సాంకేతిక యుగంలో కొవిడ్‌పై సమాచారమూ మహమ్మారిలాగే వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం/నకిలీ వార్తల విస్తృతి, స్థాయి మునుపెన్నడూ లేని రీతిలో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఇది. ఆయా దేశాల ప్రభుత్వాలన్నీ తప్పుడు సమాచారానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నాయి. మనదేశం విషయానికొస్తే, ప్రధాని సహా, పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం వదంతులు నమ్మొద్దంటూ ప్రజలను కోరారు. ఇలాంటి తప్పుడు సమాచారం వైరస్‌పై పోరులో ప్రభుత్వాల కృషిని బలహీనపరచే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, జనతా కర్ఫ్యూ సందర్భంగా రెండు అంశాలకు సంబంధించిన తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. మానవ శరీరం బయట వైరస్‌ కేవలం పన్నెండు గంటలు మాత్రమే జీవిస్తుందని, ఒక రోజు కర్ఫ్యూ వల్ల గొలుసుకట్టు వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని అందులో ప్రచారం జరిగింది. మరొకదానిలో అందరూ కలిసి సమష్టిగా చప్పట్లు కొట్టడం వల్ల సానుకూల ప్రకంపనలు ఉత్పన్నమై, వైరస్‌ బలహీనపడుతుందని పేర్కొనే వీడియో వెలుగులోకి వచ్చింది. చాలామంది స్పందనతో ఈ రెండు నకిలీ వార్తల ప్రభావం, వ్యాప్తి విస్తృతమైంది. ఫలితంగా జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం చాలామంది వీధుల్లోకి వచ్చి ఎంతగట్టిగా శబ్దం చేస్తే, వైరస్‌ అంతత్వరగా బలహీన పడుతుందనే ఉద్దేశంతో సామాజిక దూరం వంటి నిబంధనలన్నింటినీ తోసిరాజంటూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ రెండు నకిలీ వార్తల్లోనూ నిజం లేదంటూ ప్రభుత్వం ప్రకటించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బహుళ రూపాల్లో...

కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చైనాలో మొదలైనప్పటి నుంచి స్థూలంగా అయిదు అంశాల చుట్టూ తప్పుడు సమాచారం సృష్టి జరుగుతోంది.

మొదటి అంశం...

వైరస్‌ పుట్టుక, వ్యాప్తి, లక్షణాల చుట్టూ సమాచార వ్యాప్తి జరిగింది. ఇలాంటి సమాచారానికి ఆధారంగా కొంతమంది పేర్లనూ జోడించడంతో విశ్వసనీయమైనదిగా అనిపించింది. ఒక వార్తలో ముక్కు కారడం అనేది వైరస్‌ లక్షణాల్లో ఒకటి కాదని పేర్కొనగా, మరికొందరు కొవిడ్‌ను గుర్తించేందుకు శ్వాస పరీక్ష చేయడం మంచిదని సూచించారు. ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రజల్లో ఆందోళనను పెంచడంతోపాటు, కొన్ని లక్షణాల విషయంలో నిర్లక్ష్యానికి కారణమవుతాయన్న సంగతిని మరవరాదు.

రెండో అంశం...

చికిత్సలకు సంబంధించినది. కరోనా వైరస్‌ నివారణ లేదా చికిత్సకు సంబంధించి అద్భుత ఉపాయాల పేరిట కొన్ని అంశాలు బాగా ప్రాశస్త్యం పొందుతున్నాయి. వేడి చేసిన వెల్లుల్లి, నిమ్మ మొదలు పసుపు వంటి పలు ఇంటి చిట్కాలను ప్రచారం చేస్తున్నారు. మద్యం, కల్లు, బీఫ్‌ వంటివానీ వైరస్‌కు చికిత్సగా సూచిస్తున్నారు. వీటికి ఆధారంగా ప్రఖ్యాత సంస్థల పేరిట వారు నిర్వహించని అధ్యయనాలను సైతం పేర్కొంటున్నారు. ప్రజలు వైద్య సలహాలు మానేసి, ఇలాంటి చికిత్సల్ని పాటిస్తే, తీవ్ర పరిణామాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు.

మూడో అంశం...

వైరస్‌ వ్యాప్తి చుట్టూ జరుగుతున్న ప్రచారం. ఇందులో దిగ్భ్రాంతి గొలిపే చిత్రాల్ని, దృశ్యాల్ని వ్యాపింపజేస్తూ, వాటిని చైనా, ఇటలీ దేశాలకు ముడిపెడుతున్నారు. మృతదేహాలన్నీ నేలపై వేసినట్లుగా ఉన్న చిత్రం బాగా ప్రచారమైంది. వాస్తవానికి అది జర్మనీకి సంబంధించినది. ఆ చిత్రంలోని అంశాన్ని చైనా, ఇటలీ రెండింటికీ అన్వయించారు. ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచెయ్యడం, పరిస్థితులు బయటికి చెబుతున్న దానికంటే అత్యంత దారుణంగా ఉన్నాయని నమ్మేలా చేయడమే ఇలాంటి చిత్రాల ప్రచారం వెనక ఉద్దేశమన్న సంగతి తెలుసుకోవాలి.

నాలుగో అంశం..

ప్రభుత్వాలు, అధికార వ్యవస్థల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం. లాక్‌డౌన్‌ చిత్రాలు, ఏడుస్తున్న ప్రధాన మంత్రులు, వారు చేయని ప్రకటనల్ని సైతం వారికి ఆపాదించడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ప్రజల్ని మరింతగా భయకంపితుల్ని చేయడమే వీరి ఉద్దేశం. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు తెరవడానికి సంబంధించిన నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వ్యాప్తి చెందాయి.

ఐదో అంశం...

ఇది కుట్ర సిద్ధాంతాలకు సంబంధించినది. వైరస్‌ పుట్టుక దానికి సంబంధించిన విజ్ఞానం వంటి అంశాల్ని ఇందులో ప్రచారం చేశారు. గతంలో వచ్చిన ఒక సినిమాలో ఈ వైరస్‌ను ఎలా ప్రస్తావించారనే అంశం మొదలు డెటాల్‌ సీసా వెనక కరోనా వైరస్‌ పేరు ఉండటం వరకు రకరకాల అంశాలన్నింటినీ ప్రచారంలోకి తెచ్చారు. మొత్తానికి ఈ వైరస్‌ అనేది మనిషి సృష్టించిన కుట్ర అనే సిద్ధాంతానికి బలం చేకూర్చడమే ఇలాంటి అంశాల ప్రచారం వెనక ఉద్దేశమని గుర్తించాలి. వీటితోపాటు, ఇటీవలి కాలంలో మతపరమైన అంశాలతో కూడిన నకిలీ వార్తల వ్యాప్తీ అన్ని వర్గాల్లో పెరిగింది.

ప్రజా చైతన్యమే ఆయుధం

సాంకేతిక కంపెనీలు కూడా సాధికార సమాచార వ్యాప్తి కోసం ‘ఇన్‌ఫర్మేషన్‌ హబ్‌’లను ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాస్తవాల్ని తనిఖీచేసే ఉద్యమకారులు కొవిడ్‌కు సంబంధించిన తప్పుడు ప్రకటనల్లో నిజాల్ని నిగ్గు తేల్చారు. తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. 45 దేశాలనుంచి 100 వాస్తవ తనిఖీ సంస్థలతో ‘ఇంటర్నల్‌ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ నెట్‌వర్క్‌ (ఐఎఫ్‌సీఎన్‌)’ ఆధ్వర్యంలో ‘కరోనా వైరస్‌ ఫ్యాక్ట్స్‌’ అని ఒక కూటమి ఏర్పడింది. ఇది పదిహేనుకుపైగా భాషల్లో వేలకొద్దీ వాస్తవ తనిఖీలను చేపట్టింది. భారత్‌నుంచి పలు సంస్థలు ఈ కూటమితో కలిసి పనిచేస్తున్నాయి. భారత ప్రభుత్వ సమాచార విభాగం కూడా వాస్తవాలను తనిఖీ చేసుకునే ఏర్పాటు చేసింది. ఏదేమైనా- ప్రస్తుత పరిస్థితుల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలి. ప్రతి ఒక్కరూ తప్పుడు సమాచారాన్ని అడ్డుకునే సైనికుల్లా తయారు కావాలి. ప్రపంచమంతా ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మన ప్రతిస్పందన, తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా జరిగే సమష్టి పోరాటంలో భారీ మార్పును తీసుకొస్తుంది.

మరేం చేయాలి?

కొన్ని దేశాలు కొవిడ్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక చట్టాల్ని తీసుకొస్తున్నాయి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నవారిపై ‘విపత్తు నిర్వహణ చట్టం, 2005’లోని సెక్షన్‌ 54 కింద కేసు పెడుతున్నారు. ఇలాంటి చర్యలు నిరోధకంగా పని చేస్తాయిగాని, ప్రభుత్వంతోపాటు అందరి తరఫు నుంచి క్రియాశీలక సమాచార పంపిణీ ఒక్కటే దీనికి సుస్థిర పరిష్కారంగా భావించవచ్చు. ప్రతి ఒక్కరికీ వారి సొంత భాషలో సాధికార, విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉండేలా చేయడమే అందరి అజెండా కావాలి. ప్రభుత్వాలు కచ్చితత్వంతోకూడిన, నమ్మకమైన, సమాచారాన్ని సకాలంలో క్రియాశీలకంగా వ్యాప్తి చేస్తే, ప్రజలు వదంతుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. సమాచార పంపిణీలో ఆలస్యమైతే తప్పు జరిగే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వాలు కొవిడ్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, చాట్‌బోట్లు ఏర్పాటు చేసి పౌరులందరికీ సాధికార సమాచారాన్ని అందజేస్తున్నాయి. వాస్తవాలను తనిఖీ చేసుకునే ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అవతరించింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో సమాచార విభాగం సైతం ఇటీవల వాస్తవాలను తనిఖీ చేసుకునే ఏర్పాటు చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో ఇలాంటి చర్యలు స్వాగతనీయ పరిణామం.

ABOUT THE AUTHOR

...view details