మామూలు రోజుల్లో అయితే ఉగాదితో మొదలై శ్రీరామనవమి దాకా తొమ్మిది రోజులూ ‘శ్రీసీతారాముల కల్యాణము చూతమురారండీ...’ అనే పాటతో ఊరూవాడా మోతెక్కిపోయేవి. ఈసారి అలాలేదు పరిస్థితి. ‘తక్కువేమి మనకు... రాముండొక్కడుండువరకూ...’ అనుకుంటూ ఆ గీతాలను స్మార్ట్ ఫోన్లలో వినాల్సి వస్తోంది. కల్యాణం నుంచి పట్టాభిషేకం వరకు కావలసిన అన్ని రకాల పాటలూ ఇంట్లోనే విని ఆనందించాలి. పంచాంగంలో చెప్పినట్లు- శని ప్రభావమేమో!
పద్నాలుగు సంవత్సరాలు వనవాసం రాములవారికైతే, 14 వరకూ గృహవాసం మనకు. అప్పటివరకు ‘ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది...?’. అంచేత ఇంట్లోనే ఉంటూ చేతనైన పనులు చేసేద్దాం. ఎన్నాళ్లుగానో వాయిదాలు వేస్తూవచ్చిన పనులన్నీ, ఇప్పుడు వరసగా ఒక్కటొక్కటిగా కానిచ్చేదాం. ఇళ్ళు, బండ్లు అన్నీ శుభ్రం చేసేసుకుందాం. గదులు, వసారాలు, వరండాలు... సమస్తమూ ఊడ్చిపారేద్దాం. బూజులు, దుమ్మూ ధూళి దులిపేద్దాం. ఇవన్నీ చేసిచూడండి... ఆ ఇంటి ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, మీ పరిసరాలు ఎంత బాగుపడతాయో. కాలక్షేపానికి కాలక్షేపం... ఒంటికీ మంచి వ్యాయామం!
ఈ మాటలు నచ్చకపోతే, పోనీ ప్రతి ఇల్లూ ఓ ‘బిగ్‌బాస్ హౌస్’ అనుకోండి. స్వార్థమే పరమార్థంగా కేవలం డబ్బు కోసమే జరిగే ఆ బిగ్‌బాస్‌లో ఎవరో ఒక్కరే విజేత. కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతల మధ్య జరిగే ఈ ఇరవైఒక్క రోజుల బిగ్‌బాస్ హౌస్‌లో మనమందరమూ విజేతలమే. మరి విజేతలుగా నిలవాలీ అంటే మనమూ గడపదాటకూడదు. అక్కడేమో, ఒకడిమీద ఒకడు పైచేయి సాధించడం కోసం, ఏ ఒక్కడో గెలవడంకోసం యుద్ధం. ఇక్కడేమో, అందరం కలసిమెలసి ఒక్కటై, కలివిడిగా గెలవడంకోసం తపన.
భద్రాచల రాములవారికి సైతం ఈ సంవత్సరం ఏకాంతంలోనే కల్యాణం, పట్టాభిషేకాలు జరుపుతున్నారు. ఏం చేస్తాం మరి? ‘అనువుగాని చోట అధికులమనరాదు, కొద్దిగుండుటెల్ల కొదువగాదు’ అని అనుకుని ఊరుకోవాలి. నాగాస్త్రం నుంచి అర్జునుణ్ని కాపాడటానికి రథాన్ని శ్రీకృష్ణుడు కొద్దిగా కిందికి తొక్కిపెట్టినట్లు, ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడటానికి, ప్రధాని, ముఖ్యమంత్రులు కలిసి మనల్ని ఇళ్ళల్లోనే ‘లాక్‌డౌన్’ చేశారు. తప్పదు మరి!
రాములోరి పందిళ్లు..