విదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చిన్నపాటి విధానపరమైన నిర్ణయాలు భారత ప్రజల ఇంటి వంటగదుల్లో మంటలు రాజేస్తున్నాయి. ఇండొనేసియా, మలేసియా దేశాల్లో జీవ ఇంధనం వినియోగాన్ని 10 శాతం అదనంగా పెంచాలన్న నిర్ణయం మనదేశ వంటనూనెల ధరలను భగ్గుమనిపించాయి. నాలుగు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధర క్వింటాలుకు రూ.5,445 నుంచి రూ.6,914కు పెరిగింది. లీటరు పామాయిల్ ధర రూ.85కి ఎగబాకింది. పేదలు, సామాన్యులు ఎక్కువగా వాడుతున్న వంటనూనె ఇదే. వేరుసెనగ, సోయాచిక్కుడు, ఆవ, పొద్దుతిరుగుడు వంటి నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. పత్తి గింజల నూనె ధర సైతం మండుతోంది.
రైతులకు ఇవ్వరు కానీ..
నూనెగింజల పంట సాగు విషయంలో రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వాలు, మరోవైపు విదేశాల నుంచి నూనెల దిగుమతి కోసం ఏటా రూ.75 వేలకోట్లను ధారపోస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి రైతు కుటుంబ బ్యాంకు ఖాతాలో ఆరు వేల రూపాయల చొప్పున వేయడానికి ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’(పీఎం కిసాన్)కి కేంద్ర బడ్జెట్‌లో రూ.75 వేల కోట్లు కేటాయించారు. మరోవైపు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి నిరుడు రూ.75 వేలకోట్లు చెల్లించారు.
ఈ ఏడాది చెల్లింపులు ఇప్పటికే రూ.80 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఎక్కడో సుదూరాన ఉన్న దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న అర్జెంటీనా, బ్రెజిల్ మొదలుకుని రొమేనియా, రష్యా, ఉక్రెయిన్, మలేసియా, ఇండొనేసియా, సౌదీ అరేబియాల నుంచి గత నవంబరులో మనదేశం 10.96 లక్షల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంది. ఎడారి దేశమైన సౌదీ అరేబియా నుంచీ ఒక్క నెలలోనే 11 వేల టన్నుల సోయా నూనె తెప్పించారు.
స్వదేశీ నూనెలపై దుష్ప్రచారం
మూడు దశాబ్దాలుగా బహుళజాతి సంస్థలు చేస్తున్న ప్రచారం వల్ల వంటనూనెల వినియోగంలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు వేరుసెనగ, కొబ్బరి, నువ్వులు, ఆవ నూనెలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని దేశంలో అధికంగా వాడేవారు. వాటివల్ల ఆరోగ్యానికి, గుండెకు చేటు అనే విస్తృత ప్రచారం వల్ల విదేశాల్లో అధికంగా పండే సోయాచిక్కుడు, ఆయిల్‌పాం, పొద్దుతిరుగుడు నూనెల వినియోగం దేశంలో పెరిగింది. ఉదాహరణకు గత నూనెల ఏడాది(2018 నవంబరు నుంచి 2019 అక్టోబరు) వరకూ 1.49 కోట్ల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది నాలుగు లక్షల టన్నులు అదనం. మొత్తంగా దిగుమతైన నూనెల్లో 98 శాతం(1.47 కోట్ల టన్నులు) పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయా నూనెలే కావడం గమనార్హం. భారత ప్రజలు అనాదిగా వాడే సంప్రదాయ వంటనూనెల వాటా గణనీయంగా తగ్గిపోయింది. జన్యుమార్పిడితో దూది దిగుబడి పెంచేందుకు విదేశీ బహుళజాతి సంస్థ మన విపణిలోకి తెచ్చిన బీటీ పత్తి గింజల నుంచి వంటనూనె తయారీ ఏకంగా 12 లక్షల టన్నులకు చేరింది. ఇవే బీటీ పత్తి గింజలను కనీసం దూదిపంటగా సాగుచేయడానికి సైతం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు అనుమతించడం లేదు. రెండు దశాబ్దాలుగా మనదేశంలో మాత్రం అవి భారీగా సాగవుతున్నాయి.
అంతేకాదు, అదే పత్తి పంట నుంచి తీస్తున్న గింజలతో తయారైన నూనె మన ఆహారంలోకి వచ్చేస్తోంది. బీటీ పత్తి గింజల నూనె ప్లాంట్లు గుజరాత్‌లో అధికంగా ఉన్నాయి. వీటినే ఆధునాతన యంత్రాలతో తెలంగాణలో ఏర్పాటు చేయడానికి పత్తి మిల్లుల వ్యాపారులు ముందుకొచ్చారు. ఆహార శుద్ధి కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వంటనూనెల కొరత తీవ్రంగా ఉండటంతో ఏదో ఒక నూనెతో ప్రజలూ సరిపెట్టుకొంటున్నారు.
తప్పుడు ప్రచారాలు..
గతంలో పంటల సాగుకు బీటీ వంగ, ఆవ గింజల అమ్మకాలను అనుమతించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కానీ, బీటీ పత్తి నుంచి తయారుచేస్తున్న నూనె వినియోగం విస్తరిస్తుండటం వంట నూనెల కొరత తీవ్రతకు నిదర్శనం. రసాయనాలతో శుద్ధి చేసిన(రిఫైన్డ్) వంటనూనెలు గుండెకు మంచివనే ప్రచారం అధికంగా ఉంది. దీనివల్లనే నిరుడు 27.30 లక్షల టన్నుల రిఫైన్డ్ నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు.
వేరుసెనగ నూనెలో కొవ్వు ఎక్కువగా ఉందని, అది గుండెకు మంచిది కాదనే ప్రచారం వల్ల మనదేశంలో పండే నాణ్యమైన పల్లీలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలో గతేడాది కోటి ఎకరాల్లో వేరుసెనగ పంట సాగవగా 27.33 లక్షల టన్నుల పల్లీల దిగుబడి వచ్చింది. అందులో కేవలం 13.46 శాతమే(3.68 లక్షల టన్నుల పల్లీలే) నూనె తయారీకి గానుగాడినట్లు భారత నూనె మిల్లుల సంఘం తాజా నివేదికలో వెల్లడించింది. విదేశాలకు 3.15 లక్షల టన్నుల పల్లీలను ఎగుమతి చేశారు.