"దేవుడి దయ వల్ల నేను నాటు వైద్యం చేస్తున్నాను. కుక్కకాటు, ఇతర వ్యాధులు తగ్గించేందుకు నేను నూనె తయారు చేస్తాను. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. కానీ, నేను ఎవరినీ అడగను. కేవలం ప్రజల ప్రేమ, దేవుడి దయ వల్లే నేను బతుకుబండి నడిపిస్తున్నాను. ఎలా బతుకుతున్నామనేది పక్కన పెడితే బతుకుతున్నాము చాలు"..... కడు పేదరికాన్ని అనుభవిస్తున్నా బాధను దిగమింగి.. చిరునవ్వుతో పద్మశ్రీ సిమోన్ ఉరావ్ చెప్పిన మాటలివి!
పద్మశ్రీ అవార్డు గ్రహీత సిమోన్ ఉరావ్ స్వస్థలం ఝార్ఖండ్ రాంచీకి సమీపంలోని ఖక్సీ టోలీ గ్రామం. ఆయన జల పురుషుడిగా అందరికీ సుపరిచితులే. నీరు, వనం, నేలను కాపాడుకునేందుకు ఆయన చేసిన కృషికి యావత్ ప్రపంచం సలాం చేసింది. రైతు, సమాజ అభ్యుదయం కోసం అంతలా పోరాడిన ఆయన్ను.. ఎన్నో పురస్కారాలు, ఇంకెన్నో ప్రశంసా పత్రాలు వరించాయి. కానీ, ఇప్పుడు ఆయన కనీసం మనవరాళ్లను చదివించుకునే స్తోమత లేని స్థితిలో ఉన్నారు. పొట్టకూటి కోసం 83 ఏళ్ల వయసులోనూ నాటు వైద్యం చేస్తూ బతుకీడుస్తున్నారు.
దేశం గర్వించే వ్యక్తిత్వం...
సిమోన్ వర్షపు నీటిని ఒడిసిపట్టి వాటితో వ్యవసాయం చేయడమే కాక... భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులు, బావులు తవ్వించారు. అందుకే ఆయన్ను జల పురుషుడు అని పిలుస్తారు. వన సురక్షా సమితి, భూ సంరక్షణ సమితి ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు.
ఆయన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం మూడు సార్లు ఆయన్ను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ, సిమోన్ ఆ అవార్డును మూడు సార్లు తిరస్కరించారు. ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తామని మాటిచ్చాక 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు.
ఇప్పుడు సిమోన్ కడు పేదరికంలో మగ్గుతున్నారు. వృద్ధాప్యంలోనూ ఉచితంగా నాటు వైద్యం చేస్తున్నారు. ఎవరైనా దయతలచి డబ్బులిస్తేనే తీసుకుంటారు.
ఇన్ని కష్టాలున్నా.. ప్రభుత్వం నుంచి గానీ, తాను సాయం చేసిన వారి నుంచి గానీ ఒక్క రూపాయి ఆశించట్లేదు సిమోన్. కానీ, ఆయనపై ఉన్న గౌరవంతో సిమోన్కు ఆర్థికంగా సాయపడాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు స్థానికులు.
"పద్మశ్రీ సిమోన్ చేపట్టిన కార్యక్రమాల వల్లే.. మా గ్రామల్లో రైతులు క్షేమంగా ఉన్నారు. అందుకు ఆయనకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చాలా పురస్కారాలు సైతం దక్కాయి. కానీ ఈ రోజు ఆయన ఆర్థిక స్థితి ఏమీ బాలేదు. ప్రభుత్వం ఈ విషమై చర్యలు తీసుకోవాలి. "
-సునీల్ కశ్యప్, గ్రామస్థుడు.
ఇదీ చదవండి:గ్రామస్థుల ధైర్యంతో ఎలుగుబంటి సురక్షితం!