ఎయిమ్స్ 'వండర్'- 6 రోజుల అవిభక్త కవలలు సేఫ్! రాజస్థాన్ వైద్యులు వైద్య రంగం చరిత్రలో మరోమారు చెరగని ముద్ర వేశారు. జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్ డాక్టర్లు... తమ కీలక నిర్ణయంతో ఆరు రోజుల అవిభక్తకవలకు శస్త్రచికిత్స చేసి వారి ప్రాణాలు రక్షించారు.
వైద్యుల నిర్ణయమే కీలకం...
ఆరు రోజుల క్రితం ఎయిమ్స్‌లో... కడుపు, గుండె అతుక్కుపోయిన అవిభక్త కవలలు జన్మించారు. వైద్యులు క్షుణ్నంగా పరిశీలించి ఇరువురికి వేరు వేరు గుండెలు ఉన్నట్టు గుర్తించారు.
శుక్రవారం అకస్మాత్తుగా కవలల్లో ఒకరి పరిస్థితి విషమించింది. వైద్యులు పరీక్ష చేయగా.. పేగులో విపరీతమైన రక్తస్రావం జరిగి... గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
అవిభక్త కవలల విషయంలో ఓ శిశువు మరణించిన 30 నిమిషాల్లో మరో బిడ్డను వేరు చేయాలి. లేకపోతే ఆ బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పరిస్థితి అక్కడి వరకు చేరకుండానే.. డాక్టర్ అరవింద్ సిన్హా నేతృత్వంలోని వైద్య బృందం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కవలలకు తక్షణమే శస్త్ర చికిత్స చేయడానికి సిద్ధపడింది.
"సాధారణంగా ఇలాంటి కవలల శస్త్రచికిత్సకు మూడు నుంచి ఆరు నెలల లోపల చేయాల్సి ఉంటుంది. కానీ వీరిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉంది. గుండె, కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు. బతికే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రెండో శిశువుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో శస్త్రచికిత్స చేయడం అవసరమని తలచి ఇరువురిని వేరు చేశాం."
-అరవింద్ సిన్హా, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ.
రిపబ్లిక్ డే రోజున ఐదు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి కవలల ప్రాణాలు కాపాడారు. ఆరు రోజుల అవిభక్తకవలలకు ఇంత క్లిష్టమైన చికిత్స చేసి విజయం సాధించడం వల్ల వైద్యులపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం కవలల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
అభివక్తకవలలకు శస్త్రచికిత్స చేసి వేరు చేయడం జోధ్‌పుర్ ఎయిమ్స్ వైద్యులకు కొత్త విషయం కాదు. ఇప్పటికే ఒకసారి విజయవంతంగా చికిత్స చేశారు.
ఇదీ చూడండి : బోడో తిరుగుబాటుదారులతో కేంద్రం కీలక ఒప్పందం