భారత్-చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ డ్రాగన్‌కు పరోక్ష హెచ్చరికలు చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. భారత్ శాంతి మంత్రాన్నే నమ్ముకున్నా.. దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తే దీటైన సమాధానం చెప్పగలదని స్పష్టం చేశారు. కొన్ని సరిహద్దు దేశాలు విస్తరణవాదంతో దుస్సాహసానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. చైనా పేరు ప్రస్తావించకుండానే గట్టి హెచ్చరికలు పంపారు.
" కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం పోరాడుతుంటే.. కొందరు మన పోరుగువాళ్లు విస్తరణవాదంతో దుస్సాహసానికి పాల్పడుతున్నారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నా సెల్యూట్. దేశం కోసం మరణించిన వారు నిజమైన భరతమాత ముద్దుబిడ్డలు. దేశం మొత్తం వారికి సెల్యూట్ చేస్తోంది. ప్రతి భారతీయుడు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సరిహద్దు పోరాటంలో వారి ధైర్యం, మేము శాంతిని కోరుకుంటున్నాం. దుస్సాహసాలకు తగిన సమాధానం ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉన్నాం. సరిహద్దులను రక్షించే సాయుధ దళాలు, పారా మిలటరీ, పోలీసు సిబ్బంది పట్ల గర్వంగా ఉంది.
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు రాష్ట్రపతి. విదేశీ పెట్టుబడిదారుల భయాలు తగ్గిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రపంచాన్నిదూరం చేయకుండా స్వయం సమృద్ధిగా ఉండటమేనని నొక్కిచెప్పారు.