మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఊహించని మలుపు తిరిగింది. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
మహారాష్ట్ర ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే భాజపాతో కలిసినట్లు అజిత్ పవార్ తెలిపారు.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఈ రోజు భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేస్తాయని అందరూ భావిస్తున్న తరుణంలో రాత్రికిరాత్రే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరిగాయి.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా, ఎన్సీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు శరద్ పవార్ భేటీ అయ్యారు.
పవార్ అంగీకారంతోనే...
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అంగీకారంతోనే భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ప్రమేయం లేకుండా ఎన్సీపీ ఏ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశాయి.