దిల్లీ దంగల్‌కు ఎంతో సమయం లేదు. ఈ నెల 8నే 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు. మరోసారి హస్తినలో అధికారం చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు గట్టి సవాల్ విసురుతున్నాయి భాజపా, కాంగ్రెస్. ఇందుకోసం ఆ పార్టీలు ఎంచుకుంటున్న ప్రధానాస్త్రం సోషల్ మీడియానే.
హస్తిన పీఠం కోసం సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నేతల మధ్య ట్వీట్ల యుద్ధమే నడుస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్, పేరడీలే వారి ప్రధాన ఆయుధాలు. ఇవే ఓట్లు తెచ్చిపెడతాయని వారి విశ్వాసం. ఈ ట్వీట్ ఫైట్... దిల్లీ ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది.
ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డీలాపడ్డ కాషాయ పార్టీ... దిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్రితం సారి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన హస్తం పార్టీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇదే తడవుగా అన్ని విధాలా రాజధాని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు.
షా నేతృత్వంలో...
దిల్లీలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా ఆప్ సర్కార్ వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నారు. అయితే.. అంతే దీటుగా బదులిస్తున్నారు చీపురు గుర్తు పార్టీ నేత కేజ్రీవాల్.
దిల్లీ సర్కార్ ఉచిత వైఫై పథకంపై కేజ్రీవాల్‌ను ట్విట్టర్లో ప్రశ్నించారు అమిత్ షా.
'' కేజ్రీవాల్ జీ.. దిల్లీ అంతా ఉచిత వైఫై అని ప్రకటించారు కదా! నేను మార్గమధ్యంలో వైఫై కోసం ప్రయత్నించా. నా బ్యాటరీ అయిపోయింది కానీ.. వైఫై మాత్రంరాలేదు.''
- ట్విట్టర్లో అమిత్ షా
అయితే.. షా ట్వీట్‌కు తనదైన రీతిలో సమాధానమిచ్చారు ఆప్ అధినేత.
''సర్, మేం ఉచిత వైఫై సేవలతో పాటు.. ఉచిత బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాన్నీ కల్పించాం. దిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్తూ ఉచితమే..!''
- అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత
ఇవే కాదు.. దిల్లీలో పాఠశాలలు, సీసీటీవీల ఏర్పాటు, మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చడం వంటివాటిపై కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తూ... అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.