అంబుజా సిమెంట్... మన్నికైన, బలమైన సిమెంట్ అంటూ అప్పట్లో వచ్చిన ప్రకటన ఎంతో ఆదరణ పొందింది. అదే ఇప్పుడు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేరడీగా మారింది. ఆ ప్రకటనను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి ఆప్, కాంగ్రెస్, భాజపా. సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్న కాంగ్రెస్, భాజపాకు కౌంటర్‌గా ఈ సిమెంట్ ప్రకటన స్పూఫ్ వీడియోను వదిలింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఆ వీడియోలో ఏముంది?
విడిపోయిన ఇద్దరు సోదరులు.. తమ మధ్య అడ్డుగా ఉన్న గోడను పడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. తమ సమూహంతో వచ్చినా, పెద్ద దుంగతో వచ్చి ఢీకొట్టినా గోడకు చిన్న చిల్లు కూడా పడదు. బాంబులు పెట్టి పేల్చేద్దామని చూసినా ఫలితం శూన్యం. ఎందుకంటే అది అంబుజా సిమెంట్‌తో చేసిన గోడ. బలం, నిజాయితీకి మారుపేరు అంటూ ప్రకటన ముగుస్తుంది. ఈ ప్రకటనతో దిల్లీ ఎన్నికలకు సంబంధమేంటనేగా మీ సందేహం. ఉంది మరి!
ఇక్కడ విడిపోయిన సోదరులు ఎవరో కాదు.. కాంగ్రెస్, భాజపా. మధ్యలో ఉన్న గోడ కేజ్రీవాల్. ఇక ఆ సమూహం ఇరు వర్గాల కార్యకర్తలు. పెద్ద దుంగేమో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బాంబులు.. సీబీఐ దాడులు. ఇలా ఎవరేం చేసినా అధికారం తమదేనని... మధ్యలో అంబుజా సిమెంట్ అంత బలమైనదిగా ఉన్న గోడ కేజ్రీవాల్ అంటూ వీడియో ముగుస్తుంది.
స్ఫూఫ్, మీమ్స్ వార్..
ఆ వీడియో స్పూఫ్.. భాజపా, కాంగ్రెస్‌ను చిర్రెత్తిపోయేలా చేసింది. తామేం తక్కువ కాదంటూ పేరడీలను వదిలాయి. అప్పటినుంచి మొదలైన ఈ స్పూఫ్ వార్ కొనసాగుతూనే ఉంది.
అదే అంబుజా సిమెంట్ ప్రకటనను కొద్దిగా మార్పులు చేసి దిల్లీ భాజపా వదిలింది. ఇక్కడేమో కేజ్రీవాల్ స్థానంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ... సోదరులుగా కన్నయ్య కుమార్, కేజ్రీవాల్ ఉంటారు. మధ్యలో దుంగ, బాంబులుగా జేఎన్‌యూ, జామియా అల్లర్లను వీడియోలో ప్రస్తావించింది భాజపా. గోడ ఎందుకు ధ్వంసం కావట్లేదని ఆ సోదరులు అడగ్గా.. అది 130 కోట్ల మంది భారతీయుల ప్రేమతో తయారైంది, ఎలా బద్దలవుతుంది? మోదీ జాతీయ వాదాన్ని ఏం చేయలేరంటూ వీడియో ముగుస్తుంది. ఇక్కడ భాజపా తమ గెలుపుగా పేర్కొంది.
సూపర్ మారియో టూ సూపర్ కేజ్రీవాల్...