తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: కేజ్రీ మంత్రం మరోసారి ఫలిస్తుందా?

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా సాగుతోంది. హస్తిన పీఠంపై మరోసారి జెండా రెపరెడలాడించాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆశపడుతోంది. 'అభివృద్ధి చీపురు'తో అన్ని స్థానాలను ఊడ్చేయాలని ఊవిళ్లూరుతోంది.

delhi dhangal
delhi dhangal

By

Published : Jan 26, 2020, 2:01 PM IST

Updated : Feb 25, 2020, 4:24 PM IST

దిల్లీ దంగల్​: కేజ్రీ మంత్రం మరోసారి ఫలిస్తుందా?

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. దిల్లీ ఎన్నికల రణంలో విజయమే లక్ష్యంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి.

దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్​ జరగనుంది. 11న ఫలితం వెలువడనుంది.

ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార అస్త్రాలను సంధిస్తోంది. "అచ్చే బీతే పాంచ్ సాల్.. లగే రహో కేజ్రీవాల్" నినాదంతో ఆప్​ సేన ప్రచారంలో దూసుకుపోతోంది. 70 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్.. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు.

న్యూదిల్లీ స్థానం నుంచి సీఎం కేజ్రీవాల్, పట్​పఢ్ గంజ్ నుంచి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పోటీ పడుతున్నారు. ఎన్నికల ప్రముఖ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్​కు చెందిన ఐప్యాక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని... పటిష్ఠ ప్రణాళికలతో ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్.

లోక్​సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా..

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కస్థానంలో కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. అసెంబ్లీపై మాత్రం పట్టు తమదే అని ధీమాగా ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రజలకున్న అవగాహనే తమను గెలిపిస్తుందంటున్నారు ఆ పార్టీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 కి 67 స్థానాలతో సంచలనం సృష్టించారు కేజ్రీవాల్​. మరోసారి అవే ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పనులతో పాటు కొత్తగా 10 హామీలతో గ్యారంటీ కార్డును విడుదల చేశారు. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల భద్రత, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు, 24 గంటల విద్యుత్​ సరఫరా, తాగునీటి సరఫరా, రెండు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం, యుమునా నది ప్రక్షాళన, కాలుష్య నివారణ వంటి హామీలను దిల్లీవాసులకు ఇచ్చారు.

ఈ ఐదేళ్లు... కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్​తో వివాదాలతోనే నెట్టుకొచ్చిన కేజ్రీవాల్​.. దాని ప్రభావం పథకాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.

సామాన్యుడికి ఉపయోగపడేలా విద్య, వైద్యరంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చింది ఆప్​ ప్రభుత్వం. మొహల్లా క్లినిక్​ల ఏర్పాటు, విద్యాలయాల ఆధునికీకరణ, ఉచిత విద్యుత్(200 యూనిట్లు)​, నీటి బకాయిల రద్దు, మహిళలకు ఉచిత రవాణా, సీసీ కెమెరాలు, ఇంటివద్దకే ప్రభుత్వం.. ఇలా ప్రజాకర్షక పథకాలను అమలు చేశారు.

"దిల్లీలో కేజ్రీవాల్​ చేసినంత పని గతంలో ఎవరూ చేయలేదు. భవిష్యత్తులోనూ ఎవరూ చేయరు. అన్ని అంశాలకు సంబంధించి సదుపాయాలు కల్పించారు. నీరు, విద్య, విద్యుత్​కు సంబంధించి ఎన్నో చేశారు."

- గోపాల్​ గుప్తా, దిల్లీ ఓటరు

"కేజ్రీవాల్​ ప్రభుత్వం బాగానే ఉంది. అయితే ఆయన ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చారు. కొన్ని అలానే ఉన్నాయి."

-మనోజ్​, దిల్లీ ఓటరు

ఇతర రాష్ట్రాలలోని ఆప్​ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా ఆప్ తరఫున దిల్లీలో ప్రచారం చేస్తున్నారు. వినూత్నంగా వీధి నాటకాల రూపంలో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

అగ్రనేతలు X కేజ్రీవాల్​

భాజపా తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, నటులు ప్రచార తారలుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సహా పలువురు నటులు ప్రచార సభలను హోరెత్తిస్తుంటే.. ఆప్ తరఫున కేజ్రీవాల్ ఒక్కరే అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్​కు పోటీగా ఇతర పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత లేకపోవడం కూడా ఆప్​కు కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Feb 25, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details