కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్‌కు దిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన్ను అక్టోబర్ 1వరకు జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం. డీకే బెయిల్ పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
డీకేను ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి. వైద్యుల సూచనల మేరకు అవసరమైతే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చాలని నిర్దేశించారు.
జుడీషియల్ కస్టడీ... కానీ....
కోర్టు నిర్ణయం ప్రకటించడానికి ముందు డీకే శివకుమార్ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని శివకుమార్ తరఫు న్యాయవాది కోరారు. డీకేకు భారీ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
బెయిల్ ఇవ్వాలన్న డీకే న్యాయవాది వాదనల్ని ఈడీ తోసిపుచ్చింది. శివ కుమార్‌కు చికిత్స అవసరమైతే తామే చూసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతానికి ఆయన్ను జుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. అదే సమయంలో... ఆయన్ను జైలులోనే విచారించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
వాదనలు విన్న న్యాయస్థానం... శివకుమార్‌ను జుడీషియల్ కస్టడీకి అప్పగించింది. బెయిల్ అభ్యర్థనపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
సెప్టెంబర్ 3న మనీలాండరింగ్ కేసులో డీకేను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
ఇదీ చూడండి: ఫేస్బుక్, ఇన్‌స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?