దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా.. 672 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. 13వేల 750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 90వేల మందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల సంఘం ఆరుగురు ప్రముఖులతో ప్రచారం చేయించింది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 70 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైద్య చికిత్సకు అవసరమైన కిట్, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు, ర్యాంపులు, వృద్ధులను ఇంటి నుంచి తీసుకవచ్చి తిరిగి దింపేందుకు వాహనాలు ఈ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. భద్రత సహా 380 పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఈసీ మహిళలకు అప్పగించింది. మరో 11 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా దివ్యాంగులతోనే నిర్వహించనుండగా, ఇంకో 11 పోలింగ్ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించింది.
షహీన్‌బాగ్‌పై ప్రత్యేక నిఘా..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోని 5 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. భారీగా బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు
మొత్తం అసెంబ్లీ స్థానాలు | 70 |
పోటీలో ఉన్న అభ్యర్థులు | 672 |
మొత్తం ఓటర్లు | 1,47,86,382 |
పోలింగ్ కేంద్రాలు | 13,750 |
భద్రతా సిబ్బంది | 90,000 |