ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేసే ప్రభుత్వ అధికారులపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎన్ని సార్లు చెప్పినా అధికారుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని మండిపడింది. ఏదో లాంఛనప్రాయంగా తప్పదన్నట్లు నెలలు గడిచాక న్యాయస్థానంలో అపీళ్లు దాఖలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఫైళ్ల విషయంలో ఎలాంటి ముందడుగు వేయని అధికారులపై ఏనాడూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించింది.
'ఆ అధికారులపై ఎప్పుడూ చర్యలు తీసుకోరే?' - supreme court latest news
న్యాయస్థానాన్ని ఆలస్యంగా ఆశ్రయిస్తున్న ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏదో లాంఛనప్రాయంగా కోర్టులో అపీళ్లు దాఖలు చేస్తున్నారని చీవాట్లు పెట్టింది. ఓ తీర్పుపై 462 రోజులు ఆలస్యంగా సవాలు చేసిన పిటిషనర్‌కు రూ.15 వేలు జరిమానా విధించింది.
'ఖాళీగా కూర్చొనే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరు'
ఓ కేసులో బాంబే హైకోర్టు గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాలపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 462 రోజులు ఆలస్యంగా కోర్టును ఆశ్రయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాజ్యాన్ని తిరస్కరించింది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో అత్యున్నత ధర్మాసనం. లాంఛనప్రాయంగా కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా మారిందని చీవాట్లు పెట్టింది. న్యాయస్థానం సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.15 వేలు జరిమానా విధించింది.