తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులపై సమీక్షించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపిన మంత్రి.. బలగాల ఉపసంహరణ అంశంపై ఆరా తీశారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే, నావికాదళ అధిపతి అడ్మైరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాలతో పాటు పలువురు సీనియర్ సైనిక అధికారులతో జరిగిన సమావేశంలో సమీక్ష నిర్వహించారు రాజ్‌నాథ్.
తూర్పు లద్ధాఖ్తో పాటు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలలోనూ నియంత్రణ రేఖ వెంటనున్న ప్రాంతాల్లోని పరిస్థితిని.. రక్షణ మంత్రికి వివరించారు ఆర్మీ చీఫ్. ఆ ప్రాంతాల్లో ఎలాంటి అనివార్య పరిస్థితులు తలెత్తినా.. ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. గల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి వివాదాస్పద ప్రాంతాల్లో 3 కి.మీ. మేర బలగాలు వెనక్కి మరలినట్లు తెలిపారు. అయితే, ఫింగర్-4, ప్యాంగోంగ్ ప్రాంతంలోనూ క్రమంగా బలగాలను తగ్గిస్తున్నట్లు తెలిపారు.
లద్ధాఖ్‌లో భారత్-చైనా సైన్యం మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15న అర్ధరాత్రి గల్వాన్ లోయ వద్ద తెలెత్తిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం.. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. దశల వారీగా బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి.
ఇదీ చదవండి: భారత్- చైనా మధ్య మరోసారి దౌత్య చర్చలు