ఎటు చూసినా ఎడతెరపి లేని వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ప్రమాదకర స్థాయిలో నదులు... విరిగి పడిన కొండచరియలు.. ఇది అందాల కేరళ ప్రస్తుత పరిస్థితి.
వరద గుప్పిట్లో చిక్కుకున్న కేరళ వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. మొత్తం 22 వేల మంది పునరావాస కేంద్రాలకు తరిలించారు అధికారులు. రాష్ట్రంలో 24 చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు గుర్తించారు.
సీఎం సమీక్ష...
వరద పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత వాయుసేన సహాయం కోరినట్లు తెలిపారు.
"వయనాడ్ మెప్పాడిలో నిన్న భారీ కొండచరియలువిరిగి పడ్డాయి. రెండు కొండల మధ్య ఉన్న ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది." - పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి విజయన్ భారత వాయుసేన సహాయం కోరినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, అటవీ అధికారులు ఇలా అందరూ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వివరించారు. మొత్తం 13 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, 180 మంది సైన్యాధికారుల బృందం రాష్ట్రానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.