మహారాష్ట్రలో వరద బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 50కి చేరుకుంది. మరో ముగ్గురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడం వల్ల మరిన్ని మృతదేహాలను గుర్తించడానికి వీలైందని చెబుతున్నారు.
గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు 12 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపుర్, సంగ్లీ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం అక్కడ వరదలు తగ్గుముఖం పట్టాయి. కృష్ణ, పంచగంగా నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయి కంటే దిగువకు వచ్చిందని అధికారులు తెలిపారు.
"కొల్హాపూర్ జిల్లా రాజారాం వీర్ వద్ద పంచగంగా నది 41.6 అడుగుల నీటిమట్టంలో ప్రవహిస్తోంది. సంగ్లీ వద్ద కృష్ణానది నీటిమట్టం 39.1 అడుగులుగా ఉంది." -అధికారులు
ప్రస్తుతం సంగ్లీ, కొల్హాపుర్ జిల్లాల్లో 6.45 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఆల్మట్టి నుంచి దిగువకు నీటి విడుదల
మహారాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేసింది. వరదల నుంచి మహారాష్ట్ర కోలుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,813 కోట్ల సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కోరారు.