కరోనా నుంచి కోలుకున్నవారిలో పలువురికి అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తాయి. దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో పదిహేను రోజుల్లో 13 కేసులు నమోదయ్యాయి. 'ముకొర్మైకోసిస్' అనే బ్లాక్ ఫంగస్‌ను వీరిలో గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా సగం మంది రోగులు ప్రాణాలు కోల్పోతారని, మిగిలినవారు చూపు, దవడ కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ ఫంగస్ ప్రధానంగా మొక్కలు, జంతువులతో పాటు గాలిలోనూ ఉంటుందని సీనియర్ ఈఎన్టీ సర్జన్ డా. మనీష్ ముంజల్ తెలిపారు. కొవిడ్ అనంతరం తలెత్తె ఫంగల్ ఇన్ఫెక్షన్లపై ఆయన పరిశోధన చేస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఫంగస్ కరోనా రోగులపై దాడి చేస్తోందని చెప్పారు. ఇతర జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని అన్నారు.
"ఈ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల కంటి చూపు పోతుంది. 15 రోజుల్లో ఇలాంటివి 13 కేసులు గంగారాం ఆస్పత్రిలో వెలుగుచూశాయి. ఇన్ఫెక్షన్ వల్ల రోగుల ముక్కు, దవడ ఎముకను తీసేయాల్సి వచ్చింది. ఈ వ్యాధి మరణాల రేటు 50 శాతం. ఇన్ఫెక్షన్ కంటికి గానీ, మెదడుకు గానీ చేరుకుంటే రోగి ప్రాణాలు కోల్పోతాడు. చాలా మంది రోగులు తమకు ఊపిరి ఆడటం లేదని చెబుతున్నారు. బలహీనత, అలసట లక్షణాలు ఉన్నాయి. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఇన్ఫెక్షన్ ఇంత ప్రమాదకరంగా మారలేదు. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా కనిపిస్తోంది."