'ఫొని' తుపాను విధ్వంసం ఒడిశాను కకావికలం చేసింది. శుక్రవారం ఉదయం ఒడిశా తీరాన్ని ఢీకొట్టిన తుపాను ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 10వేల గ్రామాలు, పట్టణాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు అధికారులు.
భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. భారీ స్థాయిలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. 12 లక్షల మంది తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
"ఇది చాలా అరుదైన, తీవ్రమైన తుపాను. 43 ఏళ్లలో అత్యంత ప్రమాదకరమైనది. 150 ఏళ్లలో చూస్తే మూడింటిలో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగానే ఫొనిని ఓ సవాల్‌గా తీసుకున్నాం. మా ప్రభుత్వానికి ప్రతి ప్రాణం ముఖ్యమే. అదే లక్ష్యంగా పనిచేశాం. 12 లక్షల మంది ప్రాణాల కోసం కృషిచేసిన వలంటీర్లు, ప్రభుత్వోద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన పని మౌలిక సదుపాయాల పునరుద్ధరణే. ఒడిశా ఇంతలా మారేందుకు సహకరించిన 2.5కోట్ల మంది ప్రజలకు అభినందనలు."
-నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం
పూరీలో భారీగా నష్టం
పూరీ జిల్లాకు అత్యంత నష్టం వాటిల్లింది. గంటకు 175 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, వేలాది చెట్లు కూలిపోయాయి. పూరీ, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో పైకప్పులు ఎగిరిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కుంభవృష్టి కారణంగా పూరీ సహా తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లోని ఇళ్లు నీట మునిగాయి.