తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవి'పై ఆరా

బురేవి తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు.

Cyclone Burevi : Very heavy rainfall predicted in Tamil Nadu, Kerala
ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవీ'పై ఆరా

By

Published : Dec 2, 2020, 8:49 PM IST

తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బురేవి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు.

సహాయక చర్యలు

తుపాను నేపథ్యంలో తీరప్రాంతాల్లోని 175 కుటుంబాలకు చెందిన 697 మంది ప్రజలను సహాయ శిబిరాలకు తరలించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. 2,489 శిబిరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి ఎనిమిది ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు వాయుసేన, నావికా దళం సైతం సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

అతి భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన ఈ తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. రానున్న 12 గంటల్లో తుపాను మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 90 కి.మీ గరిష్ఠ వేగంతో కన్యాకుమారి, పంబన్ మధ్య డిసెంబర్ 4న తీరం దాటుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్డ్ జారీ చేసింది.

శ్రీలంకకు చెందిన ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయ దిశగా 240 కి.మీ, పంబన్​ తీరానికి తూర్పు ఆగ్నేయాన 470 కి.మీ, కన్యాకుమారికి తూర్పు ఈశాన్య దిశగా 650 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయవ్య దిశగా గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోంది.

తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details