తెలంగాణ

telangana

దేశంలో తొలిసారి ఇంగువ సాగు ప్రారంభం

By

Published : Oct 20, 2020, 6:25 PM IST

హిమాచల్​ప్రదేశ్​లో ఇంగువ సాగు ప్రారంభించినట్లు సీఎస్ఐఆర్ తెలిపింది. అక్టోబర్ 15న క్వారింగ్ గ్రామంలో సీఎస్​ఐఆర్-ఐహెచ్​బీటీ డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ తొలి ఇంగువ విత్తనాన్ని నాటినట్లు వెల్లడించింది. దేశంలో ఇంగువ సాగు ప్రారంభించేందుకు గత 30 ఏళ్లలో చేసిన తొలి ప్రయత్నం ఇదేనని స్పష్టం చేసింది.

CSIR introduces 'heeng' cultivation in Himachal's Lahaul Valley
దేశంలో తొలిసారి ఇంగువ సాగు

హిమాచల్ ​ప్రదేశ్​లో నిరుపయోగమైన శీతల భూభాగాల్లో ఇంగువ పంట పండించేందుకు 'ద ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ'(ఐహెచ్​బీటీ-సీఎస్ఐఆర్) నడుం కట్టింది. లాహాల్ ప్రాంతంలో రైతులతో కలిసి ఇంగువ సాగు చేపట్టింది. అక్టోబర్ 15న క్వారింగ్ గ్రామంలో సీఎస్​ఐఆర్-ఐహెచ్​బీటీ డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ తొలి ఇంగువ విత్తనాన్ని నాటారని సెంటర్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) తన ప్రకటనలో తెలిపింది.

ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్(ఎన్​బీపీజీఆర్) ద్వారా ఇరాన్ నుంచి 2018 అక్టోబర్​లో ఈ విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఇంగువ సాగు ప్రారంభించేందుకు గత 30 ఏళ్లలో చేసిన తొలి ప్రయత్నం ఇదేనని స్పష్టం చేసింది. సీఈహెచ్​ఏబీ, రిబ్లింగ్, లాహాల్, స్పిటి ప్రాంతాల్లో ఇంగువ మొక్కలను పెంచినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో ఇంగువ సాగు చేయనున్నట్లు మార్చి 6న తన బడ్జెట్ ప్రసంగంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ఐఆర్-ఐహెచ్​బీటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇప్పటివరకు దిగుమతే

దేశీయ వంటకాల్లో విరివిగా వాడే ఈ విలువైన మసాలాను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రూ.735 కోట్ల వ్యయంతో అఫ్గానిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్​ దేశాల నుంచి ఏటా 1,200 టన్నుల ముడి ఇంగువను తెప్పిస్తోంది. భారత్​లో సరైన వసతులు లేకపోవడం ఇంగువ సాగుకు ప్రధాన అవరోధంగా ఉంది. ఇంగువ విత్తనాలను దిగుమతి చేసుకున్న సీఎస్ఐఆర్-ఐహెచ్​బీటీ.. దేశంలో ఈ పంట పండించేందుకు తీవ్రంగా కృషి చేసింది.

ABOUT THE AUTHOR

...view details