ఎవరి వివాహానికైనా.. బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. కానీ, గుజరాత్ సూరత్‌లో జరిగిన రోహిత్, అభిలాషల పెళ్లికి గోమాత ముఖ్య అతిథిగా హాజరైంది. లేగదూడతో పాటు వచ్చి వధూవరులిద్దరినీ దీవించింది. 31 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోత్తంగా ఈ వివాహం జరిగింది. అంతేకాదు ఇంత ఘనంగా జరిగిన పెళ్లి వేడుకలో మచ్చుకైనా ప్లాస్టిక్ కనిపించలేదు.. పర్యావరణ పరిరక్షణకై.. పెళ్లి భోజనాల దగ్గరనుంచి మిగతా అన్ని చోట్లా వినియోగించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన 5వేల మట్టి గ్లాసులు, పాత్రలే దర్శనమిచ్చాయి.
గుజరాత్ సూరత్‌కు చెందిన రోహిత్, అభిలాష కొద్ది రోజుల క్రితం గోమాతను పెళ్లికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వార్తల్లో నిలిచారు. రాజస్థానీ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటామని చెప్పినట్టుగానే.. సోమవారం ఒక్కటయ్యిందీ జంట.