ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయకపోవటం వల్ల కలిగే పరిణామాలపై కొవిడ్-19 ప్రపంచానికి అవగాహన కల్పించిందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ప్రజారోగ్య రంగంలో ఆసక్తి, పెట్టుబడుల పునరుజ్జీవనానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వర్చువల్గా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 147వ సమావేశానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ.. అవసరమైన అభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచ ఆరోగ్య అంశాల అభివృద్ధికి అందరిని భాగస్వాములను చేయాలని నొక్కి చెప్పారు. ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరాన్ని 2020 ఏడాది చూపిందన్నారు. ప్రజలు ఇప్పటికే పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పులు, కాలుష్యం, వ్యాధుల వంటి సవాళ్లతో పోరాడుతున్నారని, ఇప్పుడు కరోనా మహమ్మారి కోట్లాది మంది ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.
" అందరికీ ఆరోగ్యం లేకుండా మంచి భవిష్యత్తు ఉండదు. అది మనందరికి తెలిసిన పాఠం. ఇప్పుడు మనందరం తిరిగి నేర్చుకోవాల్సిన పాఠం. సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, సంసిద్ధతను విస్మరించటం వల్ల కలిగే పరిణామాల గురించి ఈ మహమ్మారి మానవాళికి తెలియజేసింది. ఇలాంటి ప్రపంచ సంక్షోభం సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవటం, కట్టడి.. రెండూ ప్రపంచ ప్రజారోగ్య రంగాన్ని పునరుజ్జీవనం చేసేలా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చాలా ముఖ్యం. "