కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి తరచుగా చేతులు కడుక్కోవడమే ఉత్తమమార్గం. దీనికి అదనంగా శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మానవ శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించే ఉత్తమమైన ప్రక్రియ నిద్ర. శరీరం, మెదడు ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం వల్ల వైరస్ నుంచి రక్షించుకోవచ్చు.
కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ నిరంతరాయంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొంతమంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా.. స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కరోనా వ్యాధి పట్ల ఉన్న భయాందోళనలు.. యువత, పిల్లల్ని భావోద్వేగానికి లోనుచేసే అవకాశం ఉంది. పెద్దలు సైతం తమ కుటుంబసభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇక మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సరిగా నిద్రపోవడం చాలా కష్టతరమవుతోంది.
"శారీరక ప్రతిస్పందన ఆధారంగా నిద్ర అనేది రోగ నిరోధక శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఒకవేళ సరిగా నిద్రించకపోతే మన రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా వైరస్ లేదా ఇతర వ్యాధులను ఎదుర్కోవడంలో శరీరం విఫలమవుతుంది."
-బ్రిటానీ లెమోండా, సీనియర్ న్యూట్రోసైకాలజిస్ట్, న్యూయార్క్
సరైన నిద్రకోసం...
వీటన్నింటినీ పరిశీలిస్తే నిద్ర ఓ దివ్య ఔషధమని స్పష్టమవుతోంది. అందువల్ల రాత్రి పూట సరిగా నిద్రపోవడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.
మార్పు వద్దు
ప్రజాజీవితాలను కరోనా వైరస్ తలకిందులు చేసింది. చాలామంది ఇంటి నుంచే పనిచేసుకుంటున్నారు. అదే సమయంలో ఇంటి పనులనూ చక్కబెట్టేస్తున్నారు. పాఠశాలలు మూసేయడం వల్ల మరికొందరు ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటున్నారు. అయితే పనులెలా ఉన్నా సాధారణ జీవన విధానమే అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
"మన జీవితాలు ఎంత విభిన్న మార్గాల్లో ఉన్నాయో మనం గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు మనకు అలవాటైన జీవన విధానాన్నే పాటించాలి. మీరు ఇంట్లో నుంచి పని చేస్తున్నట్లైతే ఎప్పటిలానే నిద్రలేచి సమయానికి తయారవ్వండి. పక్క గదిలోకి వెళ్లినా, బెడ్రూమ్ నుంచి పనిచేసుకున్నా క్రమబద్ధమైన దినచర్యను పాటించండి."