కరోనా సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించాయి. వీటిని అనుసరిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా సెలవులను కాస్త ముందుగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి. అలాగే విద్యా సంవత్సరం నష్టపోని రీతిలో అకడమిక్ క్యాలెండర్ రూపొందించడం సహా పలు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.
రాష్ట్రాలకు ఆ హక్కు ఉంది..
"విద్య అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాలకు... తమ సొంత అకడమిక్ క్యాలెండర్ రూపొందించుకునే, వేసవి సెలవుల షెడ్యూల్ మార్చుకునే స్వేచ్ఛ ఉంది. తమ ప్రాంతంలోని కరోనా వ్యాప్తి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది."
- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి
సెలవులు ముందుకు వచ్చాయ్..
పంజాబ్లో సాధారణంగా వేసవి సెలవులు మే నెల చివరి నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈసారి కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముందుగానే అంటే ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం అయితే మార్చిలోనే వేసవి సెలవులు ప్రకటించేసింది.
సెలవుల్లో తరగతులు...
లాక్డౌన్ కారణంగా విద్యాసంవత్సరం నష్టపోకుండా వేసవిలో తరగతులు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని దిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా మేధావులను, విద్యార్థుల తల్లిదండ్రులను కోరింది.