కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించాల్సిన అఖిలపక్ష భేటీ రద్దయింది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించటం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
సాధారణంగా సమావేశాలకు ముందు అన్ని పార్టీలతో సమావేశమై సభలో ప్రభుత్వ అజెండా, లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
అఖిలపక్ష భేటీ రద్దయినప్పటికీ రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఆదివారం పార్లమెంట్ ఆవరణలో జరగనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో, సాయంత్రం నాలుగు గంటలకు ఛైర్మన్ వెంకయ్యనాయుడు నేతృత్వంలో రాజ్యసభ బీఏసీ సమావేశం జరగనుంది. కరోనా దృష్ట్యా పార్లమెంట్ ప్రవేశంపై పలు ఆంక్షలు విధించారు
రేపటి నుంచి..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 1న ముగియనున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కొవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నెగిటివ్ వచ్చిన వారికే పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుల్లో అధిక వయస్సువారే ఉండటం వల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది, ఇంటిలో పనివారికి కూడా కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంట్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యులందరికీ ముందు జాగ్రత్తగా కిట్లు సరఫరా చేశారు. అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్, అన్ని రకాల వ్యవస్థలను అధికారులు సిద్ధం చేశారు. సందర్శకులకు అనుమతిలేదని అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: పార్లమెంట్ సమావేశాలకు ఆ ఎంపీలు దూరం!