కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా చైనా నుంచి ఓడల ద్వారా వచ్చిన 63,000 మంది సిబ్బంది, ప్రయాణికులను భారత నౌకాశ్రయాలలో దిగడానికి నిరాకరించినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. జనవరి 27 నుంచి ఏప్రిల్ 30 మధ్యకాలంలో 1,990 ఓడలు వచ్చినట్లు వెల్లడించారు.
ఓడలలో వచ్చిన 62,948 మందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు థర్మల్ స్కీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఎవ్వరికీ నౌకాశ్రయాలలో దిగేందుకు అనుమతి ఇవ్వలేదని, సరకుల దిగుమతి పట్ల జాగ్రత్తగా వ్యవహరించినట్లు వివరించారు.
"మొత్తం 1990 ఓడలలో 1621 ఓడలు భారత్లోని ప్రధాన ఓడరేవులకు చేరుకున్నాయి. సరకుల ఎగుమతి, దిగుమతి కోసం వీటిని నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఉంచాము" అని అధికారులు చెప్పారు. ఈ రేవుల్లోనే 56,000మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.