రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న చట్టాలను రద్దుచేసే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవస్థల మధ్య సంఘర్షణ తలెత్తడం ప్రజాస్వామ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. అపరిమిత అధికారాలు అపరిమిత అవినీతికి దారితీస్తాయని, అందుకే మన రాజ్యాంగం అన్ని వ్యవస్థలకూ పరిమిత అధికారాలే కట్టబెట్టిందని పేర్కొన్నారు. 'లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ: చెక్స్ అండ్ బ్యాలెన్సెస్' అన్న అంశంపై ఆలిండియా లాయర్స్ ఫోరమ్ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
వ్యవస్థలన్నీ రాజ్యాంగం పరిధిలోనే..
"న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరుగా ఉంటేనే వ్యక్తిగత హక్కులను రక్షించగలం. రాజ్యాంగం కూడా అన్ని వ్యవస్థలకూ పరిమిత అధికారాలే ఇచ్చింది. పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలకు ఉండే అధికారాలన్నీ రాజ్యాంగపరిధి లోపలే ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ చెప్పారు. చట్టాలు, సవరణలు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి న్యాయసమీక్ష పరిధిలోకే వస్తాయని, అందువల్ల వాటి చెల్లుబాటును కోర్టులు నిర్ణయించాలని అన్నారు. కొన్ని విషయాల్లో కోర్టులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్న విమర్శలున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేయలేదన్న అంశం కోర్టుముందుకు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు తెరమీదకు వస్తాయి. ప్రాథమిక హక్కుల రక్షణే మూడు అంగాల ప్రధాన లక్ష్యం. అందుకోసమే అన్ని వ్యవస్థలూ పనిచేయాలి. ఇలాంటి సమయంలో కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేయనప్పుడు జోక్యం చేసుకోవడం కోర్టుల విధి. విధి నిర్వహణలో ఈ వ్యవస్థల మధ్య సంఘర్షణ తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం. కార్యనిర్వాహక వ్యవస్థతో న్యాయవ్యవస్థ చేతులు కలిపి అవి తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తే అది ప్రాథమిక హక్కులకు, మానవ హక్కులకు మంచిది కాదు. జడ్జిమెంట్లు, అభిప్రాయాలను విమర్శించవచ్చు. ఏమైనా తప్పులుంటే కోర్టులు సరిదిద్దుకోవాలి. ప్రభుత్వంలోని వ్యవస్థల మధ్య అధికార విభజన లేకుండా అన్నీ కూడబలుక్కుని చేస్తే మనం మళ్లీ రాజుల కాలానికి వెళ్తాం. కార్యనిర్వాహక వ్యవస్థ దూకుడుగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు న్యాయవ్యవస్థ వాటిని సమీక్షిస్తే మేలే జరుగుతుంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టాన్నయినా కొట్టేసే అధికారం కోర్టులకు ఉంది. ప్రజల హక్కులను కాపాడే బాధ్యతను రాజ్యాంగమే న్యాయవ్యవస్థకు అప్పగించింది."
- జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ఇదీ చూడండి:భారత ఛానెళ్లపై నిషేధాన్ని తొలగించిన నేపాల్