ఆరోగ్యం, ఆనందం కోసం ప్రకృతితో గడపాలని అందరికీ ఉంటుంది. కానీ, ఈ జీతాల వేటలో పడిపోయి ఆ అనుభూతికి దూరమవుతున్నాం. మన బతుకు మనం బతికేస్తే చాలని సరిపెట్టుకుంటున్నాం. తమిళనాడుకు చెందిన ఓ జంట మాత్రం... జీవితంలోని మాధుర్యాన్ని ప్రతిరోజు పొందుతున్నారు. ఆరేళ్లుగా నిత్యం దాదాపు 200 రామ చిలుకల ఆకలి తీర్చుతున్నారు. వారే తమిళనాడులోని నెల్వెల్లి జిల్లా శంకర్ నగర్‌కు చెందిన దంపతులు.. గణేశమూర్తి, తమిళారసి.
ఒకే దగ్గర...
చిలుకలు సాధారణంగా.. అడవుల్లో, కొబ్బరి చెట్లపై నివసిస్తాయి. పంజరాల్లో బంధించి కొంతమంది పెంచుకుంటారు. కానీ, ఓకే దగ్గర 200 చిలుకలు స్వేచ్ఛగా ఎగురుతూ కనువిందు చేయడం చాలా అరుదు. తమిళారసి ఇంటికి వెళ్తే ఆ దృశ్యాన్ని మనం చూడవచ్చు. చిలుకలు చేసే శబ్దాలను, శరీర భాషను బట్టి వాటి ఆకలిని అర్థం చేసుకోగలుగుతున్నారు ఈ దంపతులు.
అదే అలవాటుగా...
ఆరేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన.. ఈ దంపతులకు పక్షుల మీద ప్రేమను పెంచింది. తమ పెరడులోని జామకాయల కోసం వచ్చే చిలుకలు... అవి సరిపడనంతగా లేకపోవడం వల్ల నిరాశతో తిరిగి వెళ్తూ ఉండేవి. ఆ సంఘటనను చూసిన గణేశమూర్తి దంపతులు.. తామే వాటికి ఆహారాన్ని అందించాలని అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన భార్య ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తమ ఇంటి మేడ మీదనే పక్షుల కోసం అన్నం వండి పెడుతున్నారు. దాన్నే ఓ అలవాటుగా మార్చుకున్నారు. తమ ఇంటి పక్కన వాళ్లూ ఈ పక్షుల అల్లరితో ఇబ్బంది పడడం లేదని చెబుతున్నారు.