ప్రధాని నరేంద్రమోదీ చేతుల్లోనే దేశం సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరును కాంగ్రెస్ బలహీన పరుస్తోందని ఆరోపించారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారిని ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు.
" పుల్వామా ఉగ్రదాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అదే సమయంలో బాలాకోట్ వాయుదాడులతో ఇబ్బందులకు గురైంది. ఇప్పడే కాదు గతంలో లక్షిత దాడులు జరిగినప్పుడూ ఇలాగే స్పందించింది. మొదటి రెండు రోజులు భారత వాయుసేనను ఆ పార్టీ మెచ్చుకుంది. ఆ తర్వాత దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆధారాలు కోరుతున్నారు. "
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను పాకిస్థాన్ మీడియా ప్రసారం చేస్తోందని జైట్లీ తెలిపారు. వారి హయాంలో జమ్ముకశ్మీర్‌పై ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోలేదని జైట్లీ ఆరోపించారు. కశ్మీర్‌లోని పార్టీలను జాతీయ సంకీర్ణంలో జతచేర్చాలని మోదీ ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదన్నారు.