కరోనా వైరస్ కన్నా ఆ మహమ్మారిపై అంతకంతకూ పెరుగుతున్న భయాలే అతిపెద్ద సమస్యగా మారుతోందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. లాక్డౌన్ నేపథ్యంలో కూలీల వలసలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కూలీల వలసలు ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.
2 వ్యాజ్యాలపై వాదనలు
లాక్డౌన్ నేపథ్యంలో నగరాలు వదిలి స్వస్థలాలకు పయనమైన వలస కూలీలకు వసతి, ఆహారం అందించాలని కోరుతూ 2 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు ఆలకించింది.
వలస కూలీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు పిటిషనర్లు. అయితే... ఇప్పటికే అవసరమైన చర్యలన్నీ చేపట్టినట్లు నివేదించారు కేంద్రం తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఈ వ్యవహారంపై స్థితి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
పీఎం కేర్స్‌కు విరాళం....
కరోనా వైరస్ నియంత్రణకు విరాళాల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన పీఎం కేర్స్ నిధికి సుప్రీంకోర్టు సిబ్బంది తమ మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.. గెజిటెడ్ ఉద్యోగులు మూడు రోజుల వేతానాన్ని, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రెండు రోజుల జీతాన్ని, గ్రూప్ సీ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సుప్రీం కోర్టు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా సూట్లో మంత్రి వినూత్న ప్రచారం