కొవిడ్ రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సిద్ధమైంది. దాడులకు పాల్పడితే రూ.5 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం కల్పించేలా 'జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897'కి సవరణ చేయనున్నారు. దీన్ని వెంటనే అమల్లోకి తెస్తూ అత్యవసరాదేశం (ఆర్డినెన్స్) జారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని భారత వైద్య సంఘం (ఐఎంఏ) నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. అనంతరం.. ఐఎంఏ తమ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకొంది.
వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించిన కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్. కోర్టులు ఏడాది లోపు తీర్పు వెలువరిస్తాయన్నారు. వైద్య సిబ్బందిపై చేసే నేరాలన్నీ బెయిల్‌కు వీల్లేని కేసుల కిందే పరిగణించనున్నట్లు తెలిపారు. వైద్యుల వాహనాలు, క్లినిక్‌లు, ఇళ్లపై దాడులు చేసి నష్టం కలిగించిన వారి నుంచి ఆ నష్టానికి రెండు రెట్ల పరిహారం వసూలుచేసే నిబంధననూ ఈ ఆర్డినెన్స్‌లో చేర్చినట్లు తెలిపారు.
కేబినెట్ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు....
ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత పరిస్థితుల్లో నాన్ ఎంపానెల్డ్ కొవిడ్, నాన్‌కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్నా వారికి ఉచితంగా వైద్యసేవలు అందించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు జావడేకర్ చెప్పారు.
పొటాష్, ఫాస్ఫాటిక్ ఎరువులపై రాయితీ పెంపు
- ఫాస్ఫాటిక్, పొటాష్ ఎరువులపై రాయితీని 5 నుంచి 7% పెంచాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది రూ.22,186 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుందన్నారు.
- కొవిడ్-19 నివారణకు ఇదివరకే ప్రకటించిన రూ.15,000 కోట్ల ప్యాకేజీకి కేబినెట్ ఇప్పుడు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.
- ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్’, ‘హోమియోపతిక్ సెంట్రల్ కౌన్సిల్’ ఏర్పాటుకు వీలుగా కూడా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ఆమోదం