కరోనాను కట్టడి చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కుష్ఠు వ్యాధి(లెప్రసీ)పై సమర్థంగా పనిచేసిన బహుళ ప్రయోజనాలున్న వ్యాక్సిన్.. కొవిడ్-19పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరీక్షిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణమున్న ఈ వ్యాక్సిన్.. మహమ్మారిపై ఎలా పోరాడుతుందో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు సీఎస్‌ఐఆర్ తెలిపింది.
"డీసీజీఐ ఆమోదంతో లెప్రసీకి ఉపయోగించే ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌ను మేం పరీక్షిస్తున్నాం. కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయడం సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే వ్యాక్సిన్ కోసం మేం కృషి చేస్తున్నాం. మరో రెండు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. రాగానే ట్రయల్స్ మొదలుపెడతాం. ఆరు వారాల్లోనే ఫలితాలు తెలుస్తాయి" అని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండె అన్నారు.
వైరస్ జీనోమ్ సీక్వెన్స్‌పై.. భారత్ పరిశోధనలు చేస్తోందని డాక్టర్ శేఖర్ వెల్లడించారు. వైరస్ పుట్టుక, వ్యాప్తి నియంత్రణపై సమాచారం కోసం కీలకంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఔషధాలతో వ్యాధిని నిరోధించగలమా? వైరస్‌పై ఎంతమేరకు దాడి చేయగం? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.