దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం నాటికి వైరస్ సోకిన వారి సంఖ్య 137కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను మూసేశారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కరోనా భయంతో తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించాయి.
దేశంలో కరోనా కేసులు 137.. సర్వం బంద్‌తో నిశ్శబ్ద వాతావరణం
By
Published : Mar 17, 2020, 6:30 PM IST
|
Updated : Mar 17, 2020, 10:48 PM IST
దేశంలో కరోనా కేసులు@137.. సర్వం బంద్!
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్.. ఇప్పుడు భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మంగళవారం నాటికి వైరస్ సోకిన వారి సంఖ్య 137కు చేరింది. వీరిలో 22మంది విదేశీయులు ఉన్నారు. వైరస్ సోకిన 125 మందితో సంబంధాలున్న 52వేల మందికి పైగా సమాచారాన్ని గుర్తించామని, వారందరిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు.
కరోనా నియంత్రణ కోసం ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. బంద్‌లతో ఎక్కడికక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
సెలవుల పొడిగింపు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సెలవులను పొడిగించింది. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, పర్యటక ప్రదేశాలను ఏప్రిల్ 2 వరకు మూసేయాలని నిర్ణయించింది.
పర్యటక ప్రదేశాల్లో నిషేధం..
తమిళనాడులోని ప్రధాన పర్యటక ప్రాంతాలైన నీలగిరి కొండలు, మామళ్లపురం తదితర ప్రదేశాల్లో ప్రభుత్వం నిషేధం విధించింది. ఊటీలోని హోటళ్లు, రిసార్టుల్లో విడిది చేస్తున్న పర్యటకులను 24 గంటల్లో అక్కడి నుంచి వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
తొలి కరోనా కేసు...
పుదుచ్చేరిలో ఇవాళ తొలి కరోనా కేసు నమోదైంది. 68 ఏళ్ళ మహిళకు ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.
కార్పొరేట్ గ్రీన్ సిగ్నల్
వైరస్ ప్రభావం కారణంగా మహారాష్ట్రలోని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించుకునేందుకు అంగీకరించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె తెలిపారు. సుమారు 25 మంది కార్పొరేట్ ప్రతినిధులతో సమావేశం జరిపిన అనంతరం రాజేశ్ ఈ ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎఫ్సీఏ.. ముంబయి, పుణెలలో 50 శాతం ఉద్యోగులను మార్చి 31 వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని నిర్ణయించింది. చెన్నైలోని ఇంజినీరింగ్ సిబ్బందికి మాత్రం వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తమ సంస్థలో ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని స్పష్టం చేసింది ఎఫ్సీఏ.
కేసుల నమోదు ఇలా...
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 40 మందికి వైరస్ సోకింది. కేరళలో 26, హరియాణాలో 15(14 మంది విదేశీయులు), యూపీలో 15, కర్ణాటకలో 11 మంది చొప్పున బాధితులున్నారు. తెలంగాణలో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు.