దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివారణ చర్యలు చేపట్టాయి. జన సంచారం అధికంగా ఉండే సినిమా హాళ్లు, దుకాణ సముదాయాలు, విద్యాసంస్థలను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు క్రీడలు, వేడుకలను రద్దు చేశాయి.
తొలి మరణంతో
దేశంలో కరోనా కారణంగా మరణించిన తొలి వ్యక్తి కర్ణాటక కలబురిగి వాసి. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది యడియూరప్ప ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, నైట్క్లబ్స్, విశ్వవిద్యాలయాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది.
వాటితో పాటు అన్ని రకాల ప్రదర్శనలు, సమ్మర్ క్యాంపులు, సమావేశాలు, పెళ్లి, జన్మదిన వేడకలను వారం పాటు అనుమతించబోమని స్పష్టం చేసింది.
యూపీలో విద్యాసంస్థలు బంద్..
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈనెల 22 వరకు మూసివేయాలని ఆదేశించింది. పరీక్షల షెడ్యూల్ లేని అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే పరీక్షలు ఉన్న విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
యూపీలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి.
విద్యార్థుల ఖాతాల్లోకి...
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు అన్ని సినిమా థియేటర్లు, ఉద్యానవనాలు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది బిహార్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు తెలిపింది.