తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో మరో 309 కరోనా కేసులు.. 10 మరణాలు - corona update news

Earlier in the day, Union Minister for Youth Affairs and Sports, Kiren Rijiju had requested Manipur Chief Minister N Biren Singh to provide medical assistance to Dingko Singh.

corona virus cases in india
దేశంలో 20వేలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Apr 22, 2020, 8:16 AM IST

Updated : Apr 22, 2020, 9:24 PM IST

21:10 April 22

ముంబయిలో ఇవాళ ఒక్కరోజే మరో 309 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 3754కు చేరింది. మరో 10 మరణాలతో నగరంలో మృతుల సంఖ్య 160కి చేరినట్లు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ వెల్లడించింది. 

20:14 April 22

గుజరాత్​లో ఇవాళ 135 కొత్త కేసులు

గుజరాత్​లో ఇవాళ 135 కరోనా కేసులు బయటపడ్డాయి. వీటితో రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 2407కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

20:11 April 22

కరోనా దృష్ట్యా అమర్​నాథ్​ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఇచ్చిన పత్రికా ప్రకటనను ఉప సంహరించుకున్నారు అధికారులు.

19:40 April 22

మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 431 కేసులు

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 431 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5649 మందికి ఈ మహమ్మారి వైరస్​ సోకింది. 269 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఉత్తరాఖండ్​లో కేసుల్లేవ్​

మరోవైపు ఉత్తరాఖండ్లో వరుసగా రెండోరోజు ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కాలేదు.

19:30 April 22

ప్రధానికి బిల్​గేట్స్​ లేఖ

కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం అత్యద్భుతమని కొనియాడారు మైక్రోసాఫ్ట్​​ సహ వ్యవస్థాపకులు బిల్​గేట్స్​. కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న లాక్​డౌన్​ వంటి కార్యక్రమాల వల్లే భారత్​లో కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పట్టాయని మెచ్చుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు బిల్​గేట్స్​

లేఖలోని మరిన్ని ముఖ్యాంశాలు

  • మోదీ చేపట్టిన చర్యల వల్లే భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది
  • కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పాటించడం ఉత్తమచర్య
  • ఐసోలేషన్లు, క్వారంటైన్‌, హాట్‌స్పాట్‌ల వంటి చర్యలు బాగున్నాయి
  • వైద్య విధానం బలోపేతం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయి
  • భారత్‌లో డిజిటల్‌ సామర్థ్యాన్ని కూడా పెంచడం హర్షణీయం
  • ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు

19:18 April 22

అమర్​నాథ్​ యాత్ర రద్దు

కరోనా మహమ్మారి కారణంగా అమర్​నాథ్​ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

18:19 April 22

సీఎంలతో మోదీ...

కరోనా వైరస్​పై పోరులో భాగంగా ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ భేటీ జరగనుంది. లాక్​డౌన్​ ప్రభావం, కరోనా విజృంభణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.

18:10 April 22

వైద్యుల రక్షణపై రాజీలేదు

వైద్య సిబ్బంది ఆరోగ్యంలో రాజీపడే అవకాశమే లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన తాజా ఆదేశాలపై ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

18:01 April 22

దేశంలో 652కు చేరిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20వేలు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 20,471 మంది వైరస్​ బారిన పడగా.. 652 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. 3960 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.

17:47 April 22

కరోనాతో వీరు జాగ్రత్తగా ఉండాలి

ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. పొగతాగేవారికి ఈ వైరస్‌ వేగంగా సోకే అవకాశం ఉందని తెలిపింది. పొగతాగేటప్పుడు చేతుల్ని నోటికి దగ్గరగా తేవడం వల్ల ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటూ ట్విట్టర్‌లో తెలిపింది. అలాగే, పొగాకు ఉత్పత్తులు శ్వాసకోశ వ్యవస్థను బలహీనపరిచి వైరస్‌ వ్యాప్తికి దోహదపడతాయని పేర్కొంది.

17:16 April 22

మధ్యప్రదేశ్​లో మరో 40 కేసులు

మధ్యప్రదేశ్​లో ఇవాళ మరో 40 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొవిడ్​-19 మొత్తం కేసుల సంఖ్య 1587కు చేరింది. ఎంపీలో ఇప్పటివరకు 152 మంది ఈ మహమ్మారిబారి నుంచి కోలుకున్నారు.

17:03 April 22

'భారత ప్రధానికి కృతజ్ఞతలు'

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు అవసరమైన ఔషధాలను నేపాల్​కు అందించినందుకు భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. 23 టన్నుల ఔషధాలను భారత్​ నుంచి దిగుమతి చేసుకున్నట్లు ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

16:50 April 22

ఇవాళ 27

జమ్ముకశ్మీర్​లో ఇవాళ 27 కరోనా కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 407కు చేరింది.

16:06 April 22

ఇమ్రాన్​కు పరీక్షలు

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం తెలిపింది. గత వారం ఇమ్రాన్‌ను కలిసిన సేవా సంస్థ అధిపతి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. 

15:10 April 22

కేంద్రమంత్రివర్గం భేటీలోని కీలక నిర్ణయాలు

  • కరోనా నియంత్రణ చర్యలపై చర్చించిన కేంద్రమంత్రివర్గం
  • వైద్య సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు: ప్రకాశ్‌ జావడేకర్‌
  • వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు: ప్రకాశ్‌ జావడేకర్‌
  • వైద్యుల రక్షణకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాం: ప్రకాశ్‌ జావడేకర్‌
  • వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే 6 నెలల నుంచి ఏడేళ్లకు వరకు జైలు: జావడేకర్‌
  • రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా: ప్రకాశ్‌ జావడేకర్‌
  • వైద్యులపై దాడికి సంబంధించి నాన్‌ బెయిలబుల్‌ కేసులు: జావడేకర్‌
  • కొవిడ్‌ బాధితులకు ఆయుష్మాన్‌ పథకం కింద చికిత్స: జావడేకర్‌
  • కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా: జావడేకర్‌
  • దేశంలో 735 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి: ప్రకాశ్‌ జావడేకర్‌
  • 2 లక్షలకు పైగా బెడ్లు, 12190 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి: జావడేకర్‌
  • ఎన్‌-95 మాస్కులు 25 లక్షలు అందుబాటులో ఉన్నాయి: ప్రకాశ్‌ జావడేకర్‌
  • మరో 50 లక్షల ఎన్‌-95 మాస్కుల తయారీకి ఆదేశించాం: జావడేకర్‌

15:01 April 22

21,717 మంది మృతి

స్పెయిన్​లో కరోనా ధాటికి ఇవాళ మరో 435 మంది మృతి చెందారు. ఫలితంగా దేశవ్యాప్తంగా కొవిడ్​-19 మృతుల సంఖ్య 21,717కు చేరింది. స్పెయిన్​లో ఇప్పటివరకు మొత్తం 2,08,389 మందికి కరోనా సోకింది. ఇందులో 85,915 మంది కోలుకున్నారు.

14:08 April 22

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం వినియోగాలపై కేంద్రం సూచనలు చేసింది. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ విక్రయాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఔషధాన్ని కొవిడ్-19 రోగులకు చికిత్స చేసే ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం మరిన్ని సూచనలు

  • కొవిడ్ పాజిటివ్ రోగి నుంచి వైరస్ సంక్రమించిన సన్నిహితులే వినియోగించాలని స్పష్టం
  • వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం హానికరమని తెలిపిన ప్రభుత్వం
  • ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనలు
  • వ్యక్తుల శరీరాలపై కూడా సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి ప్రమాదకరమని సూచన
  • వ్యక్తులు, సమూహంగా ఉన్న వారిపై ద్రావణం పిచికారి నిషేధమన్న ప్రభుత్వం
  • కేవలం వస్తువులు, ఉపరితలాలపై మాత్రమే పిచికారి చల్లాలని స్పష్టం

13:35 April 22

బంగాల్​లో...

బంగాల్​లోని బదూరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేషన్​ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్థులు రోడ్లను నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను వెనక్కి పంపడానికి ప్రయత్నించారు. కానీ వారు ఎంతకీ వినకపోవడం వల్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

13:16 April 22

బిహార్​లో మరో ఐదు పాజిటివ్​ కేసులు

బిహార్​లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 131కు చేరింది.

12:40 April 22

పోలీసులు-స్థానికుల మధ్య రాళ్ల యుద్ధం

ఉత్తర్​ప్రదేశ్​ అలీఘడ్​లో పోలీసులు-కొంతమంది స్థానికుల మధ్య రాళ్ల యుద్ధం జరిగింది. కూరగాయల షాపులు మూసివేసే సమయంలో వర్తకుల మధ్య వాగ్వాదం చెలరేగగా.. పోలీసులు అక్కడి చేరారు. అయితే ఆ వెంటనే కొందరు సమూహంగా ఏర్పడి పోలీసులపై రాళ్ల దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

12:31 April 22

కొత్తగా 64 మందికి పాజిటివ్​

రాజస్థాన్​లో మరో 64 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​-19 సోకినవారి సంఖ్య 1799కి చేరింది. ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

12:15 April 22

నిరసనలు విరమించిన ఇండియన్​ మెడికల్​ అసోషియేషన్​

వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాలను విరమించుకున్నట్లు తెలిపింది ఇండియన్​ మెడికల్​ అసోషియేషన్​. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​తో వీడియో కాన్ఫరెన్స్​ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

12:06 April 22

యూఎస్​లో అరోరా

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్​ అరోరాకు లాక్​డౌన్ ఎఫెక్ట్ తగిలింది. ఆంక్షలకు ముందే అమెరికా వెళ్లిన ఆయన.. భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు రద్దు చేసినందున ప్రస్తుతం యూఎస్​లోనే ఇరుక్కుపోయారు. 

12:02 April 22

కేంద్ర ఉద్యోగికి కరోనా

పౌర విమానయానశాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సదరు ఉద్యోగి ఈ నెల 15న కార్యాలయానికి వచ్చారని.. అనంతరం 21వ తేదీన కరోనా పాజిటివ్​గా వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతనితో కలిసి మెలిగినవారు ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వివరించారు.

11:40 April 22

సీఆర్పీఎఫ్ జవానుకు కరోనా

జమ్ముకశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఆర్పీఎఫ్​ జవానుకు కరోనా పాజిటివ్​ వచ్చింది. అతన్ని వెంటనే దిల్లీ హాస్పిటల్​కు తరలించారు అధికారులు. ప్రస్తుతం ఐసోలేషన్​ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

11:36 April 22

కేంద్ర మంత్రివర్గం భేటీ

ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ ప్రభావం, దేశ ఆర్థిక స్థితి, తదుపరి చర్యలపై మంత్రుల బృందం చర్చ జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చించినట్లు సమాచారం. క్యాబినెట్ భేటీకి ముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమైంది.

11:22 April 22

గుజరాత్​లో కరోనా మృత్యుఘోష ఆగట్లేదు. రాష్ట్రంలో మరో ఐదుగురు ఈ మహమ్మారిసోకి మృత్యువాతపడ్డారు. ఫలితంగా గుజరాత్​లో మొత్తం కొవిడ్​-19 మృతుల సంఖ్య 95కు చేరింది. మృతుల్లో నలుగురు అహ్మదాబాద్​లోనే మరణించడం గమనార్హం, మరొకరు సూరత్​లో ప్రణాలొదిలారు.

10:47 April 22

లాక్​డౌన్​లో మరికొన్ని వస్తువుల అమ్మకాలకు సడలింపునిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రీపెయిడ్​ ఫోన్​ రీఛార్జులు, విద్యా పుస్తకాలు, ఎలక్ట్రిక్​ ఫ్యాన్ల అమ్మకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

10:37 April 22

'చైనా ప్రసార సాధనంగా డబ్ల్యూహెచ్​ఓ'

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)పై మరోసారి మండిపడింది అగ్రరాజ్యం అమెరికా. చైనా ప్రసార సాధనంగా డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోందని ఆరోపించింది. కరోనా వైరస్​ సంక్షోభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన విశ్వసనీయతను కోల్పోయిందని ట్రంప్​ అధికార విభాగం మండిపడింది.

10:22 April 22

'నిరసనలు ఆపండి-అండగా ఉంటాం'

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కొవిడ్-19 నియంత్రణలో విశేష కృషి చేస్తున్న డాక్టర్లు, వైద్య బృందానికి అభినందనలు తెలిపారు షా. వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు నిరసనగా ఇవాళ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు ఆపాలని హోంమంత్రి కోరినట్లు సమాచారం. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని షా భరోసా ఇచ్చినట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

10:15 April 22

కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రజలు మాత్రం అందుకు పూర్తిగా సహకరించట్లేదు. తాజాగా మధ్యప్రదేశ్​లో లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు రోడ్లపై కనిపించారు. వీరిపై చర్యలు తీసుకున్న పోలీసులు.. నడిరోడ్డుపైనే వ్యాయామం చేయించారు.

09:45 April 22

మహారాష్ట్రలో ఆగని ఘోష

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పుణెలో ఇవాళ 53 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఫలితంగా జిల్లాలో కొవిడ్​-19 మృతుల సంఖ్య 55కు చేరింది.

08:12 April 22

దేశంలో 20వేలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి వ్యాప్తి  దేశంలో రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. 24 గంటల్లోనే 1383 కొత్త కేసులు నమోదు కాగా, 50మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 19,984కు పెరిగింది. మృతుల సంఖ్య 640కి చేరింది.

కరోనా బారి నుంచి కోలుకుని ఇప్పటివరకు 3870 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 

Last Updated : Apr 22, 2020, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details