కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక, ఆరోగ్య రంగాలతోపాటు విద్యారంగాన్నీ కూడా అతలాకుతలం చేస్తోంది. విద్యాసంవత్సరం ముగింపు దశలో కొవిడ్ విజృంభణ తరగతులు, పరీక్షల నిర్వహణ పాలిట పెను అవరోధంగా నిలిచింది. దాదాపుగా 191 దేశాలు తమ విద్యాసంస్థలను మూసివేశాయి.
యునెస్కో అంచనాల ప్రకారం కరోనా వల్ల ప్రతి పది మందిలో తొమ్మిది మంది తరగతుల ద్వారా పాఠ్యాంశాలను సమర్థంగా నేర్చుకోలేకపోతున్నారు. విద్యాసంస్థల మూసివేత వల్ల ఎల్‌కేజీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది విద్యార్థుల చదువులు ప్రభావితమయ్యాయి.
ఆన్‌లైన్ బోధన..
ప్రత్యక్ష బోధనకు అవకాశాలు లేకపోవడం వల్ల ఆన్‌లైన్ విధానానికి మళ్ళారు. ఇందులోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 82.6 కోట్ల విద్యార్థుల వద్ద కంప్యూటర్లే లేవని యునెస్కో నివేదిక స్పష్టీకరించింది. 70.6 కోట్ల కుటుంబాలు అంతర్జాల సౌకర్యానికి నోచుకోలేదు. 5.60 కోట్ల విద్యార్థులు చరవాణుల ద్వారా విజ్ఞాన విషయాలను సేకరించగలుగుతున్నా, నెట్‌వర్క్ సమస్యల వల్ల చదవలేకపోతున్నారు.
సాంకేతిక నైపుణ్యాల కొరత..
ఉపాధ్యాయులకు కంప్యూటర్ పరిజ్ఞానం, అనుసంధాన నైపుణ్యాలు తగినంతగా లేకపోవడం సమస్యాత్మకమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 70 శాతం మేర తరగతి గదుల ద్వారానే బోధన సాగుతోంది. ఆన్‌లైన్ విధానంలో విద్యాబోధన చాలామందికి కొత్త అనుభవమే. ఒక్కసారిగా కొవిడ్ విరుచుకుపడటం వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు తాజా పరిణామాలను ఎదుర్కోవడానికి ఏ విధంగానూ సిద్ధంగా లేరన్నది అక్షర సత్యం.
మందులేని మహమ్మారి కావడం వల్ల ప్రస్తుత దుస్థితి దీర్ఘకాలం సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యారంగం సరికొత్త వ్యూహాలకు సానపట్టాల్సిన తరుణమిది.
అగ్రరాజ్యాల్లోనూ..
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అనేక పాశ్చాత్య దేశాలే భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేకపోతున్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యకు ప్రపంచ ప్రధాన కేంద్రాలు. కరోనా దూకుడు ఈ దేశాలను దిగ్భ్రమలో ముంచెత్తాయి.
భారత్, చైనాల నుంచే ఈ దేశాలకు వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తుంటారు. ఇప్పటికే జీఆర్‌ఈ, టోఫెల్ రాసి, ప్రవేశాలు పొంది విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూసిన విద్యార్థులు కూడా ఇప్పుడు ముందడుగు వేయడానికి సంకోచిస్తున్నారు. కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటం వారిని నిరాశకు గురిచేస్తోంది.
కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందన్న విషయంలోనూ ఎవరికీ స్పష్టత రావడం లేదు. పడగ విప్పిన మహమ్మారిని ఎదుర్కోవడానికే అన్ని దేశాలు సర్వశక్తియుక్తులనూ ఒడ్డుతున్నాయి. రోగులకు ఆరోగ్య సేవలు అందజేయడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి.